Bhatti Vikramarka : నాకు లేఖ రాయండి విచారణ జరిపిస్తా
"హరీష్ రావు గారు.. నాకు లేఖ రాయండి, 2014 నుంచి జరిగిన సింగరేణి టెండర్లపై విచారణ జరిపిస్తా!" - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్.
విధాత, హైదరాబాద్ : సింగరేణిలో జరిగిన టెండర్ల అక్రమాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి లేఖ రాసి తెలంగాణను ఇబ్బంది పెట్టడం కంటే నాకు లేఖ రాస్తే వెంటనే నైనీ కోల్ బ్లాక్ టెండర్ సహా 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన టెండర్లపై విచారణ జరిపిస్తానని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.హరీష్ రావు లేఖ రాయడమే ఆలస్యం ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో నేనే స్వయంగా మాట్లాడి దర్యాప్తుకు ఆదేశిస్తామన్నారు.
సింగరేణి బొగ్గు గనుల టెండర్ల అక్రమాలపై విచారణకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి నిర్ణయించడాన్ని తాను కూడా స్వాగతిస్తున్నానని, ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని భట్టి స్పష్టం చేశారు. కేవలం కొద్దిమంది వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంపైన, వ్యవస్థలపైన అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారని, అటువంటివారి వాస్తవ రూపాలను బయటకు రావాలంటే విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.
సింగరేణి స్వయం ప్రతిపత్తి సంస్థ
సింగరేణిలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు అని, అసలు ఇలాంటి టెండర్ల ఫైల్స్ లేదా ఇతరత్ర నిర్ణయాలు మంత్రుల చేతుల్లో ఉండవు అని భట్టి స్పష్టం చేశారు. సింగరేణి ఒక ఇండిపెండెంట్ బోర్డు.. అక్కడ జరిగే వ్యవహారాల్లో మంత్రుల జోక్యం ఉండదు అని తెలిపారు. ఆంధ్రజ్యోతి తొలి పలుకుల రాతల వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలియదు అని, సుదీర్ఘ రాజకీయ ప్రజాజీవితం నుంచి వచ్చిన తనపై అలాంటి కథనాలు రాయడం సరి కాదు అన్నారు. ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కొన్ని కట్టుకథలు వస్తున్నాయని భట్టి ఆరోపించారు. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో అపోహలు రావద్దన్న ఉద్దేశంలో నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల ప్రక్రియ రద్దుకు నిర్ణయించామన్నారు. బొగ్గుబావులపైన ఏ రాబందులను వాలనివ్వనని, నేను ఆస్తులు కూడా బెట్టుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు.
మా కంటే ముందే ‘సైట్ విజిట్’ అనే నిబంధన
‘సైట్ విజిట్’ అనే నిబంధనను కోల్ ఇండియా 2018లో పెట్టిందని, దీని ప్రకారమే సింగరేణి 2021లో సైట్ విజిట్‌ను తప్పనిసరి చేసిందని భట్టి తెలిపారు. 2018, 2021లో తాము అధికారంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు బ్లాక్ ల టెండర్ల వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి, సృజన్ రెడ్డికి సంబంధం లేదు అని, సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు అని వెల్లడించారు. నేను సీఎల్పీగా ఉన్న సమయంలో ఉపేందర్ రెడ్డిని ప్రలోభాలకు గురిచేసి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు అని, ఇప్పటికీ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని భట్టి గుర్తు చేశారు. బీఆర్ ఎస్ హయాంలో సింగరేణిలో 20టెండర్లు జరిగాయని, మేం వచ్చాక 5 టెండర్లు జరిగాయని తెలిపారు. బీఆర్ఎస్ వారికే టెండర్లు దక్కాయని భట్టి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Vehicle Registration | నేటి నుంచి షోరూమ్ లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్స్
USA Crime News : అమెరికాలో భార్య సహా ముగ్గురి బంధువుల హత్య !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram