Mahababad Murder | కట్టుకున్నోన్ని ఖతం చేయించింది.. రెండు రోజుల్లో చిక్కింది

విధాత, వరంగల్: మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరింగ్ తండా సమీపంలో ఈ నెల ఒకటవతేదీన జరిగిన హత్య మిస్టరీని మహబూబాబాద్ పోలీస్ లు రెండురోజుల్లోనే చేదించారు. ప్రియుని సహాయంతో కట్టుకున్న భార్యే అత్యంత కిరాతకంగా భర్తను హత్య చేయించినట్లు ధృవీకరించారు. దంతాలపల్లి మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న పార్థసారథి ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తీగలాగితే మృతుని భార్య వివాహేతరసంబందం డొంకంతా కదిలింది. ప్రియుడితో ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడనే ఆలోచనతో సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన వాస్తవాలు వెలుగు చూసాయి. ఈ.. హత్యోదంతం కేసు తాలూకు వివరాలను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
హత్యకు గురైన పార్థసారథి భార్య తాటి స్వప్నకు, ప్రభుత్వ ఉపాధ్యాయుడైన వెంకటవిద్యాసాగర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం, వివాహేతరసంబంధంగా మారింది. ఈ..అంశంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరగడం, సర్దుబాటు చేసుకోవడం, చెడు మార్గాలు పట్టకుండా కలిసి ఉండాలని నచ్చచెప్పడాలు, తిరిగి భార్యాభర్తలు కలిసి ఉండడం ఇలా చాలా జరిగాయి. అయినప్పటికీ స్వప్న, విద్యాసాగర్ ల మద్య వివాహేతర సంబందం చాటుమాటుగా కొనసాగుతూనే ఉంది.
ఈ విషయంలో భార్యాభర్తలకు చాలాసార్లు గొడవలయ్యాయి. భర్త, బందువులు హెచ్చరించిన వారి వివాహేతర సంబంధం మాత్రం మానుకోలేదు. పార్ధసారధి హత్య జరగగానే ఆయన కుటుంబసభ్యులు ఈ..అంశాలను తెలపడంతో పోలీస్ లు ఆ..కోణంలో దర్యాప్తు జరపగా స్వప్న, విద్యాసాగర్ తామే హత్య చేయించామని ఒప్పుకున్నారు. స్వప్న భర్త అయినా మృతుడు మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి లో ఉద్యోగం చేస్తుండగా అస్తమానం భార్యకు వీడియోకాల్స్ చేస్తూ, అనుమానంతో ఇబ్బంది పెడుతు తన్నాడు. అతనిని ఎలాగైనా అడ్డు తప్పించాలనే ఉద్దేశ్యంతో స్వప్న, సాగర్ లు, వినయ్ కుమార్, శివశంకర్, వంశీల సహాయం కోరారు. పార్ధసారథిని హత్య చేసేందుకు రూ. 5 లక్షలు సుపారిగా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.
పార్ధసారధి ఉగాది సెలవులకు మార్చి 28వ తేదీన కొత్తగూడెం వచ్చి అక్కడ నుండి మార్చి 31వ తేదీన తిరిగి డ్యూటీలో జాయిన్ అవ్వడం కోసం దంతాలపల్లి బయలుదేరాడు. ఈ..విషయమును పార్థసారథి భార్య అయిన స్వప్న, సాగర్ కు ఫోన్ ద్వారా తెలియపరచింది. అదే విషయాన్ని సాగర్ సుపారీ హంతకులకు చెప్పి ఇనోవా క్రిస్టా వాహనాన్ని, కొంత నగదును ఇచ్చి హత్య చేయడానికి పంపించాడు. వారు పార్ధసారధిని అనుసరిస్తూ వచ్చి, మహబూబాబాద్ దాటిన తర్వాత బోరింగ్ తండా సమీపంలో హత్య చేసారని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ తెలిపారు.
ప్రస్తుతం తాటి స్వప్న, వెంకట విద్యాసాగర్ ను అరెస్ట్ చేయడం జరిగిందని, మిగిలిన వారి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయని తెలిపారు. విచారణలో వేగంగా స్పందించి, కేసును చేదించి, అరెస్ట్ చేేసిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య, బయ్యారం సిఐ రవికుమార్, గూడూర్ సిఐ సూర్యప్రకాష్, ఎస్బీ సిఐ చంద్రమౌళి, సిసిఎస్ సిఐ హాతీరాం లతోపాటు, మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపిక, గూడూరు ఎస్ఐ గిరిధర్ రెడ్డి, కేసముద్రం, బయ్యారం, కురవి ఎస్ఐ సతీష్ లను, ఐటికోర్ సిబ్బందిని, ఇతర పోలీస్ సిబ్బందిని ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ అభినందించినారు.