Us Woman Praises Indian Healthcare | ఇండియా వైద్య వ్యవస్థను పొగిడిన అమెరికన్ మహిళ

కేవలం రూ.50కే చికిత్స లభించిందని అమెరికన్ మహిళ ఇండియా వైద్యసేవలను ప్రశంసిస్తూ వీడియో షేర్ చేసి వైరల్ అయ్యింది.

Us Woman Praises Indian Healthcare | ఇండియా వైద్య వ్యవస్థను పొగిడిన అమెరికన్ మహిళ

బొటనవేలికి గాయమైనప్పుడు తనకు కేవలం 50 రూపాయలే ఖర్చయిందంటూ ఇండియాలో వైద్యం ఎంత అందుబాటులో ఉందో షేర్ చేసుకుంది ఒక అమెరికన్ మహిళ.
అమెరికన్ మహిళ భారత వైద్యవ్యవస్థను ప్రశంసిస్తూ ఒక వీడియో పంచుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న క్రిస్టెన్ ఫిషర్, ఇటీవల తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించారు.

“సరే, నేను ఇండియాలో పొందిన వైద్య సేవల గురించి ఒక కథ చెబుతాను,” అంటూ ప్రారంభించింది ఆమె. కూరగాయలు కోస్తూ బొటనవేలు లోతుగా కోసుకుపోయిందని గుర్తుచేసుకుంది. “రక్తం ఆగకుండా వచ్చేది. ఎంత ప్రయత్నించినా ఆగలేదు. చివరికి నా భర్త టిమ్‌ తో, ‘ఈ వేలికి ఇక కుట్లు వేయించుకోవాల్సిందే అని అనిపిస్తోంది’ అన్నాను” అని ఆమె చెప్పింది. అందుకే ఇక వెంటనే వేలిని బ్యాండేజ్ తో గట్టిగా కట్టు కట్టేసి, గబగబా సైకిల్‌పై సమీప ఆసుపత్రికి వెళ్లాము.

“ఆసుపత్రిలో చిన్న ఎమర్జెన్సీ రూమ్‌లోకి నన్ను తీసుకెళ్లారు. రక్తంతో నిండిపోయిన బాండేజ్‌ను చూపించాను. నర్సులు, డాక్టర్లు రక్తస్రావం ఆపడానికి ప్రయత్నించారు. చివరికి ఒక నర్స్ వేసిన బాండేజ్ బాగా పనిచేసింది. వారు నాకు స్టిచ్‌లు అవసరం లేకపోవచ్చని చెప్పారు. అంతకు మించి ఆశ్చర్యపరిచింది ఖర్చు. మొత్తం చికిత్సకు కేవలం రూ. 50 మాత్రమే చెల్లించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అమెరికాలో అయితే ఇలాంటి అత్యవసర చికిత్సకు వందల డాలర్లు ఖర్చవుతుందని, భారతదేశంలో మాత్రం కొన్ని రూపాయలకే సమర్థవంతమైన వైద్యసేవలు లభించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఫిషర్ చెప్పింది.

ఈ చిన్న అనుభవం ద్వారా ఆమెకు భారత వైద్యసేవలు ఎంత వేగంగా, ఎంత సులభంగా అందుబాటులో ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిందని చెబుతోంది. ఆమె వీడియోకి ఇప్పటికే లక్షకుపైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు భారత వైద్యసేవలపై గర్వం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు “ఇది నిజంగా భారత్‌లోని మెడికల్ సిస్టమ్ బలం” అని ప్రశంసిస్తే, మరికొందరు “విదేశీయులూ ఇక్కడి అందుబాటు వైద్యం గురించి గుర్తించి చెప్పడం గర్వకారణం” అని స్పందించారు. భారత వైద్యవ్యవస్థలో కొన్నిసార్లు సౌకర్యాల లోపాలు ఉన్నా, ప్రాథమిక చికిత్స విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత చవకగా, వేగంగా సహాయం అందించే వ్యవస్థగా నిలుస్తుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.