Viral: అన్నదాతలకు అండగా జవాన్లు.. వీడియో వైరల్!

విధాత: దేశ రక్షణ.. శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే తమ లక్ష్యం కాదు..ఆపత్కాలంలో అవసరమైన వారికి సాయం అందించేందుకు సర్వదా సిద్ధమని భద్రతా బలగాలు చాటుకున్నాయి. వర్షంలో తడుస్తున్న రైతుల ధాన్యం తడిసిపోకుండా కవర్లు కప్పడంలో రైతులకు సహాయపడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జై జవాన్..జై కిసాన్ నినాదానికి అద్దం పట్టింది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం ఇబ్రహీంపేట ఐకేపీ సెంటర్ వద్ద రైతులు తమ ఆరుగాలం శ్రమ వరి ధాన్యాన్నిఅమ్ముకునేందుకు రాసులుగా పోశారు.
అయితే అకాల వర్షం కురవడంతో రైతుల ధాన్యం తడిసిపోనారంభించింది. దీంతో రైతులు ధాన్యం తడవకుండా ఉరుకులు పరుగులతో కవర్లు కప్పేందుకు తంటాలు పడ్డారు. అదే సమయంలో అటుగా వెలుతున్న తెలంగాణ స్పెషల్ పార్టీ పోలీసులు రైతుల ఆవస్థను గమనించారు. తమపని అది కాదనుకోకుండా వాహనాన్ని ఆపి రైతులకు సహాయం చేశారు. వర్షంలో ధాన్యం తడవకుండా రైతులకు సహాయం చేస్తు ధాన్యం రాసులపై కవర్లు కప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఇది కదా వైరల్ వీడియో..వీరు కదా రియల్ హీరోలంటూ కామెంట్ చేస్తున్నారు. అడ్డమైన సోషల్ మీడియా రీల్స్ కు లైక్ లు కొట్టడం మాని ఇటువంటి స్ఫూర్తిదాయకమైన వాటికి జై కొట్టండంటున్నారు.