Viral: వీళ్లు పిల్లలు కాదు పిడుగులు.. పాముతో తాడాట‌! (వైర‌ల్)

  • By: sr    news    Mar 15, 2025 7:21 PM IST
Viral: వీళ్లు పిల్లలు కాదు పిడుగులు.. పాముతో తాడాట‌! (వైర‌ల్)

Astralia | Skipping |Viral

చిన్నపిల్లలు తాడాట.. అదేనండీ.. స్కిప్పింగ్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. కానీ.. ఆస్ట్రేలియాలో ఈ బుడ‌త‌లకు మాత్రం ఎలాంటి భ‌యం లేద‌నుకుంటా! ఆ భ‌యం లేకుండా వారు స్కిప్పింగ్ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఉత్త స్కిప్పింగ్ వీడియోకే అంత‌టి రెస్పాన్స్ వ‌చ్చింద‌నుకుంటున్నారా? కాదు.. అదో డేంజ‌ర‌స్ స్కిప్పింగ్‌! సాధార‌ణంగా స్కిప్పింగ్‌కు తాడు ఉప‌యోగిస్తారు. కానీ.. వీళ్లు మాత్రం ఏకంగా కొండ చిలువ‌నే తాడుగా చేసుకుని స్కిప్పింగ్ ఆడ‌టం సంచ‌ల‌నం రేపింది.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో గ‌ల వూరాబిండా అనే ప్రాంతంలో చిత్రీక‌రించిన వీడియో ఇప్పుడు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది. దాదాపు ఆరుగురు చిన్నారులు మీట‌రు కంటే పొడ‌వు ఉన్న ఒక కొండ చిలువ‌తో స్కిప్పింగ్ ఆడ‌టం ఈ వీడియోలో క‌నిపిస్తుంది. ఆ పామును చెరోవైపు ప‌ట్టుకుంటే మ‌రొక‌రు దానిపై గెంతుతూ హాయిగా తుళ్లిప‌డుతున్నారు. ఈ పాము బ్లాక్ హెడెడ్ పైథాన్‌గా గుర్తించారు.

ఈ మేర‌కు 7న్యూస్ ఒక వార్త‌ను ప్ర‌సారం చేసింది. అయితే.. ఆ పాము బ‌తికి ఉన్న‌దా? లేక అప్ప‌టికే చ‌నిపోయిందా? అన్న‌దాంట్లో క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. ఈ వార్త‌పై ప‌ర్యావ‌ర‌ణ‌, టూరిజం, సైన్స్‌, ఇన్నోవేష‌న్ శాఖ ప్ర‌తినిధి ఒక‌రు స్పందిస్తూ.. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశిస్తున్న‌ట్టు తెలిపారు. క్వీన్స్‌లాండ్ వాసులంద‌రూ జంతువుల ప‌ట్ల.. అవి బ‌తికి ఉన్నా, చ‌నిపోయినా.. గౌర‌వంతో మెల‌గాల‌ని రిక్వెస్ట్ చేశారు. బ్లాక్ హెడెడ్ పైథాన్‌ను గాయ‌ప‌ర్చినా, చంపినా 12,615 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధిస్తామ‌ని హెచ్చ‌రించారు.