Warangal: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. కొండా మురళి, నన్నపనేనిలపై బస్వరాజు ‘పొలిటికల్’ బాంబు

  • By: sr    news    Mar 18, 2025 7:01 PM IST
Warangal: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. కొండా మురళి, నన్నపనేనిలపై బస్వరాజు ‘పొలిటికల్’ బాంబు
  • స్వపక్ష, విపక్షనేత పై ‘ఆజంజాహి’ భూమి బాణం
  • బసవరాజ్ తరహా రాజకీయానికి శ్రీకారం
  • వరంగల్ తూర్పులో తిరిగి పట్టు కోసం ప్రయత్నం
  • బసవరాజు కొండా మధ్య ఆధిపత్య పోరు

విధాత ప్రత్యేక ప్రతినిధి: పట్టపగలు వరంగల్ నగరం నడి బొడ్డులో కబ్జాకు గురైన ఆజంజాహీ మిల్లు కార్మిక యూనియన్ భవన స్థలం లక్ష్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడు బసవరాజు సారయ్య తనదైన మార్క్ రాజకీయ చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు స్వపక్షంలో ప్రత్యర్థిగా ఉన్న ప్రస్తుత దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు నన్నపునేని నరేందర్ లక్ష్యంగా చేసుకున్నారు. కబ్జాకు గురైన ఆజంజాహి మిల్లు కార్మిక భవన స్థల సమస్య సందర్భంగా తన రాజకీయ వ్యూహాన్ని అమలుపరిచారు. దీనికి వ్యూహాత్మకంగా ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాలను వేదికగా వినియోగించుకున్నారు. ఇది వరంగల్ లో రాజకీయ చర్చకు దారి తీసింది.

విలువైన భూములున్న మిల్లు

వరంగల్లో నగరం నడిబొడ్డులో ఉన్న ఆజంజాహి మిల్లు నిజాం కాలం నుండి ప్రఖ్యాతిగాంచిన విషయం తెలిసిందే. ప్రత్యక్షంగా 10వేల మంది కార్మికులకు, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఈ మిల్లు ఉపాధి కల్పించిన విషయం తెలిసిందే. నగరం నడిబొడ్డులో వందల ఎకరాల భూములు మిల్లు కలిగి ఉన్నది. పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల అశ్రద్ధ కారణంగా మిల్లు కొన్నేళ్ల క్రితమే మూతపడిన విషయం తెలిసిందే. ఈ మిల్లుకు వందల ఎకరాల భూములతో పాటు ఆజంజాహి మిల్లు కార్మిక యూనియన్ కు కార్మికుల కష్టార్జితంతో నిర్మించుకున్న భవనం ఉండేది. మిల్లు మూత పడిన తర్వాత దానికి సంబంధించిన భూములను రకరకాల సంస్థలకు ప్రభుత్వం విక్రయించగా, మరికొంత స్థలం ఎన్ టి సి వద్ద ఇప్పటికి ఉన్నది. ఇది ఇలా ఉండగా మిల్లు యూనియన్ కార్మిక స్థలంపై ఒక గొట్టిముక్కుల నరేందర్ రెడ్డి కన్ను వేశారు. ఆ భూమిని కబ్జా చేసి వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి ఓం నమశ్శివాయ విక్రయించారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మరికొంతమంది, ఆ పార్టీ బడా నాయకుడొకరు, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, అసంఘటిత కార్మిక సంఘం నాయకునిగా చలామణి అయ్యే సుద్దాల నాగరాజు సహకరించినట్లు ఆజంజాహి మిల్లు భూ పరిరక్షణ కమిటీ నాయకులు, మావోయిస్టు పార్టీ, న్యూ డెమోక్రసీతో సహా వివిధ రాజకీయ పక్షాల నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

 కబ్జాదారులకు పలువురి అండదండలు

ప్రముఖులుగా చెలామని అయ్యేవారు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఒకరిద్దరు ప్రత్యక్షంగా, పరోక్షంగా కబ్జాకు సహకరించడంతో సదరు భూకబ్జాదారులకు ఎక్కడలేని బలం చేకూరింది. తమ డబ్బు పలుకుబడితో ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు పొంది పట్టపగలు ఆజంజాహి మిల్లు కార్మిక భవన్ నేలమట్టం చేశారు. దశాబ్దాల పాటు కార్మిక సంఘ కార్యకలాపాలకు ట్రేడ్ యూనియన్ రాజకీయాలకు నిలయంగా నిలిచిన కార్మిక భవన్ కబ్జా కోర్ల చేతిలో ప్రస్తుతం శిధిలాలుగా మిగిలిపోయింది. ఈ శిధిలాలను పునాదులుగా చేసుకొని అంతస్తుల బిల్డింగులు కట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కార్మికులు తమ ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్ర ఏమిటంటే గత ప్రభుత్వ హాయంలోనే అన్ని పనులు పూర్తి చేసుకున్న కబ్జా కోర్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేతుల మీదుగా నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయించడం కలకలం సృష్టించింది. అన్నివర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ, కొండా మురళి, మంత్రి సురేఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వ హాయంలో జరిగిన పరిణామాలు ఏవీ తనకు తెలువనట్లు కొండా మురళి మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. తన వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రావడంతో కొండా మురళి పై ఒత్తిడి తెచ్చినందున ఆయన మాటమార్చారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే కొండా మురళి యూటర్న్ తీసుకొని తాను కొబ్బరికాయ కొట్టిన స్థలంలో కార్మికుల కోసం కమ్యూనిటీ హాల్ను నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చి వారి ఆగ్రహాన్ని చల్లపరిచేందుకు ప్రయత్నించారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కొండ మురళి అంతా తెలిసే చేసినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు బిజెపితో పాటు అన్ని పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. భూపరిరక్షణ కమిటీ తమ యూనియన్ స్థలాన్ని రక్షించుకునేందుకు ఆందోళన కొనసాగిస్తోంది. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు సహకరిస్తున్నాయి.

శాసనమండలిలో లేవనెత్తిన సారయ్య

ఆజంజాహి మిల్లు కార్మిక భవన స్థలాన్ని కొందరు ఆక్రమించిన విషయాన్ని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య శాసనమండలిలో సోమవారం లేవనెత్తడం రాజకీయ కలకలం సృష్టిస్తోంది. మండలిలో సారయ్య మాట్లాడుతూ కొంతమంది ఈ మధ్యకాలంలో మిల్లు భూమిని రెవెన్యూ భూమి అంటూ, వ్యవసాయ భూమి అంటూ దొంగ కాగితాలు పుట్టించి ఒక వ్యాపారస్తునికి అమ్మిన విషయం మీ దృష్టికి తీసుకు వస్తున్నాను చెప్పారు. స్వాతంత్రం రాకముందుకు నిర్మించిన ఆజం జాహి మిల్లు వరంగల్ లో పదివేల మంది కార్మికులకు ఉపాధి కల్పించినట్లు, ఎంతోమందికి బతుకునిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మధ్యలో దేవాదాయ , ధర్మాదాయ శాఖ మంత్రి భర్త కొండా మురళి అక్కడ కొబ్బరికాయ కొట్టారు…తర్వాత కబ్జా జరిగిన విషయం నాకు తెలవదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై దొంగ కాగితాలు సృష్టించి కార్మిక భవన్ స్థలాన్ని అమ్ముకున్నారు. స్వాతంత్రం రాకముందు ఆజం జాహి మిల్లు కార్మిక భవన్ పేరుతోనే మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ చేసి కట్టిన భవనం అది అని వివరించారు. 80 సంవత్సరాల క్రితం కట్టిన ఈ భవనమని చెప్పారు. ఈ కబ్జా విషయం పై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

కాగా, సారయ్య తన మాటల్లో అటు మాజీ ఎమ్మెల్యేను ఇటు ప్రస్తుత మంత్రి భర్త పేర్లు పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలం వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొనసాగిన బసవరాజు సారయ్య తిరిగి ఆ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ సాగుతుంది. దీనికి ఆజన్జాహి మిల్లు భూమి సమస్యను అవకాశంగా తీసుకొని తన రాజకీయ చక్రం తిప్పుతున్నారని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం సారయ్య మంత్రి సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం కొసమెరుపు. ఇప్పటికే ఈ రెండు వర్గాల మధ్య నియోజకవర్గంలో ఆధిపత్య పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఆజంజాహి కార్మికుల భూమి విషయంలో కొండా మురళి పేరు సారయ్య లేవనెత్తడం అగ్నికి ఆజ్యం తోడైనట్టు భావిస్తున్నారు.