Nizamabad: బెట్టింగ్‌కు.. మరో యువకుడు బలి!

  • By: sr    news    Apr 02, 2025 12:59 PM IST
Nizamabad: బెట్టింగ్‌కు.. మరో యువకుడు బలి!

విధాత : బెట్టింగ్ యాప్ ల మోసాలకు మరో యువకుడు బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా ఆకుల కొండూరులో ఆకాష్(25) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్‌ రూరల్‌ మండల పరిధిలోని ఆకుల కొండూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మి, గంగారాం దంపతుల కుమారుడు ఆకాశ్‌ ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తుండేవాడు.

మూడు, నాలుగేండ్ల నుంచి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. తరచూ బెట్టింగ్‌ యాప్‌లో డబ్బులు పెట్టి సుమారు రూ. 3 లక్షల వరకు నష్టపోయాడు. తాజాగా మార్చి 27న సైతం బెట్టింగ్‌ యాప్‌లో మరో రూ.25 వేలు నష్టపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆకాశ్‌ అదే రోజు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆకాశ్‌కు భార్య పద్మ, ఐదు నెలల బాబు ఉన్నాడు. రూరల్‌ ఎస్సై మహ్మద్‌ ఆరీఫ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిట్ విచారకు ఆదేశించింది. పోలీస్ శాఖ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ పైన, టీవీ, సినీ నటులపైన కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ సైతం వందలాది బెట్టింగ్ యాప్స్ ను నిషేధించింది. జీయో ఫెన్సింగ్ తో యాక్టివేషన్ లేకుండా చేసింది. అయినప్పటికి రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ ల బాధిత బలవన్మరణాలు కొనసాగుతుండటం ఆందోళన కరంగా మారింది.