MMTS రైలు అత్యాచార యత్నం కేసులో.. సంచలన ట్విస్ట్

విధాత: ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం కేసు సంచలన మలుపు తిరిగింది. అసలు ఆ రోజు రైలులో అత్యాచారమే జరగలేదని పోలీసులు కేసు క్లోజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇన్ స్ట్రాలో లో రీల్స్ చేస్తూ యువతి రైలు నుంచి జారిపడిందని.. దాన్ని కప్పి పుచ్చేందుకు అత్యాచారం పేరుతో కట్టు కథ అల్లిందని దర్యాప్తు అధికారులు తేల్చేశారు. కేసు విచారణకు దాదాపు 225 సీసీ కెమెరాలను పరిశీలించామని, 100 మంది అనుమానితులను విచారించామని, ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో చివరగా యువతిని విచారించామని తెలిపారు.
తమ విచారణలో యువతి అసలు నిజం ఒప్పుకుందని రీల్స్ చేసే ప్రయత్నంలోనే రైలు నుంచి జారీ పడినట్లుగా అంగీకరించిందని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును మూసివేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం ఘటన ఇప్పుడు అంతా ఉత్తదే అని తేలిపోవడంతో రైళ్లలోనూ మహిళలకు భద్రత కరువైందన్న విమర్శలు చేసినోళ్లు నాలుక కరుచుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే యువతి చెప్పిన కట్టుకథతో రైళ్లలో మహిళల భద్రతా వ్యవస్థపై యంత్రాంగం ఫోకస్ పెట్టిందని గుర్తు చేసుకుంటున్నారు.
అత్యాచారం కట్టుకథ ఇదే
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి(23) స్విగ్గీలో పనిచేసుకుంటూ మేడ్చల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. మార్చి 22న సెల్‌ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు రాత్రి 7 గంటల సమయంలో తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే ఎంఎంటీఎస్ రైలు మహిళల బోగీలోకి ఎక్కింది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్‌లో దిగిపోవడంతో బాధితురాలు ఒంటరిగా ఉంది. యువతి సెల్‌ఫోన్ చూసుకుంటుండగా గుర్తు తెలియని యువకుడు(23) బోగీలోకి ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. భయపడిన యువతి కదులుతున్న రైలు నుంచి దూకేయడంతో తీవ్ర గాయాలపాలైంది. రైల్వే ఎస్పీ చందనా దీప్తి కేసును దర్యాప్తు చేశారు. ప్రభుత్వం వర్గాలే ఆమెకు దగ్గరుండి మరి వైద్య చికిత్సలు జరిపించారు. కార్పోరేట్ వైద్యంలో యువతి త్వరగానే కోలుకుంది.