Bhadrakali lake | భద్రకాళి చెరువు పూడికతీతలో కాంగ్రెస్ నాయకుల కమిషన్ల మేత : దాస్యం వినయ్ భాస్కర్

Bhadrakali lake | పూడికతీత పేరుతో కోట్ల అవినీతికి కాంగ్రెస్ నాయకులు తెరలేపారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు. భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తవ్వకాల్లో పారదర్శకత కరువైందన్నారు. టెండర్లు గోల్‌మాల్… పనుల పరేషాన్ నెలకొందని వ్యాఖ్యానించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులను శనివారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నీటిని నవంబర్ నెలలో వొదిలినా… మార్చి వరకు టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
టెండర్లలో అర్హత లేని వారితో కుడా, ఇరిగేషన్ అధికారులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్ వంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కమిషన్ల కోసమే పనులను ఆలస్యం చేశారని విమర్శించారు. ఎవరి వాటా ఎంత అని ప్రశ్నించారు. కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయని అన్నారు. కాంట్రాక్టర్ అసమర్థత, స్థానిక ఎమ్మెల్యే , అధికారుల కాసుల కక్కుర్తి, కమిషన్ల వలన పూడికతీత పనులు ఆలస్యం అయ్యాయని ఆరోపించారు. పూర్తి చేయని పనులకు సైతం బిల్లులు తీసుకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐ ల్యాండ్ల పేరుతో అవినీతికి తెరలేపారన్నారు.