Revanth Reddy | రేవంత్.. ఢిల్లీ వెళ్లేది ఈ పనుల కోసమేనా?

Revanth Reddy | Delhi
- కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు
- రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చలు
- రహదారుల విస్తరణకు ఆమోదాలు
- మిలిటరీ భూముల స్వాధీనానికి కృషి
- వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్
- రీజినల్ ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్
- ఢిల్లీ పర్యటనలతోనే ఇవి సుసాధ్యం
- ప్రజా ప్రతినిధులను కలుస్తున్న సీఎం
- ఉద్యోగ నేతలకూ అపాయింట్‌మెంట్
- అధికారులతో నగరంలోనే సమీక్షలు
- ఫామ్‌హౌస్ సీఎం కన్నా నయమే కదా!
- మంత్రులకూ దొరకని ప్రగతిభవన్ ఎంట్రీ
- పలు సందర్భాల్లో వెనుదిగిన అమాత్యులు
- ప్రజలను కలిసేందుకూ ఇష్టపడని కేసీఆర్
- బీఆరెస్ నేతలకు ఇవి కనపడటం లేదా?
- ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిశీలకులు
హైదరాబాద్, (విధాత): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలకు వెళుతుంటారు! అలా వెళ్లినప్పుడే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులను కలుసుకొని సమావేశమవుతున్నారు! ఫ్లైవోవర్లకు అవసరమైన మిలిటరీ భూముల్లో అనుమతులు సాధించగలుగుతున్నారు. నావీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రాన్ని ఒప్పించగలిగారు! బీఆరెస్ హయాంలో ఊసులేకుండా పోయిన రీజినల్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటును పట్టాలెక్కిస్తున్నారు! కానీ.. పాజిటివ్ పనులు చూడటానికి ఇష్టపడకుండా.. ప్రతిదానినీ నెగెటివ్ కోణంలోనే చూడటం అలవాటైన బీఆరెస్ నేతలు మాత్రం.. రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారో లెక్కగట్టి.. తమ సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ పెట్టించుకుంటూ వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పదేళ్ల పాలన ప్రజాస్వామ్యయుతమేనా?
రాష్ట్రంలో బీఆరెస్ పదేళ్లు అధికారం చెలాయించింది. ఆ సమయంలో ప్రజాస్వామ్యయుతంగానే పరిపాలించారా? అనేది బేరీజు వేసుకోకుండా.. ఇప్పుడు పాలనపై తరచూ నోరు జారుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజమే! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలకు వెళుతున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, పెండిగ్‌లో ఉన్న పనులకు మోక్షం కల్పించేందుకు ఈ పర్యటనల సందర్భంగా సీఎం కృషి చేస్తున్న విషయాన్ని గుర్తించేందుకు బీఆరెస్ నేతలు నిరాకరిస్తున్నట్టు కనిపిస్తున్నదని పలువురు పరిశీలకులు అంటున్నారు. ఈ పర్యటనల సందర్భంగా ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, హోం మంత్రితోపాటు.. ఇతర శాఖల మంత్రులనూ ఆయన కలుస్తున్నారని వారు గుర్తు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో రహదారుల విస్తరణకు, ఫ్లైవోవర్ల నిర్మాణానికి పలు చోట్ల మిలిటరీ ఆస్తులు అడ్డంకిగా ఉన్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే కేంద్రాన్ని ఒప్పించగలగుతున్నారు. వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయించారు. తెలంగాణలో ప్రాంతీయ విమానాశ్రయాలకు మార్గం సుగమం చేశారు. ఇవన్నీ చేయిస్తూనే ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, నాయకులను కలుస్తున్నారని, అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ ప్రధాన ప్రతిపక్షానికి పట్టకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ రెండుసార్లు సీఎంగా పనిచేశారు. తనవల్లే తెలంగాణ సాకారం అయిందనే స్వీయ నమ్మకం నిలువెల్లా నిండిపోయి.. ప్రజాభిప్రాయాలను, మేధావుల ఆలోచనలను, ప్రజా ప్రతినిధుల సలహాలను చెత్తబుట్టపాలు చేశారనే విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి. లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం.. తెల్ల ఏనుగుగా మారిపోయింది. సుమారు రూ.1,500 కోట్లతో నిర్మించిన ఇరుకైన సచివాలయానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ డజన్‌సార్లకు మించి రాలేదు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బాయికాడ కూర్చొనే పాలనను పర్యవేక్షించారని, అక్కడ వీలు కాకపోతే శత్రు దుర్బేధ్యంగా బేగంపేటలో నిర్మించుకున్న ప్రగతి భవన్ (నేటి మహాత్మా జ్యోతిరావు ఫూలే భవనం)లో సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించేవారని పలువురు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
ఆర్థిక మంత్రి లేకుండానే ఆర్థిక శాఖపై రివ్యూ జరిగిపోయేది! ఆరోగ్యశాఖ మంత్రి లేకుండానే.. ఆరోగ్యరంగంపై సమీక్షలు ముగిసేవి! తాను అనుమతించి, తన ఆఫీసులో వారితో ముచ్చటపెట్టి.. అది ఏ రంగానికి సంబంధించినది అయితే.. ఆ అంశంపై సీఎం సమీక్షించినట్టు ప్రెస్‌నోట్‌లు వచ్చేవని అప్పట్లో సీఎంవో బీట్ చూసిన ఒక సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు. అనుమతి లేకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలే కాదు.. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కూడా ప్రవేశం లభించేది కాదని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు చాలా సందర్భాల్లో వెనుదిరిగి పోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. కొందరు మంత్రులైతే ‘లోపలికి పంపితే, కాసేపటికే వెనక్కి వస్తాం.. లేదంటే కార్యకర్తల ముందు ఇజ్జత్ పోతుంది’ అంటూ సెక్యురిటీతో మొత్తుకున్న ఘటనలు కోకొల్లలని ఆయన చెప్పారు.
పోలోగ్రౌండ్ కేటాయించలేదని.. రాడార్ స్టేషన్‌కు మోకాలడ్డు
సికింద్రాబాద్ పోలో గ్రౌండ్‌లో సచివాలయం నిర్మించాలని మొదట్లో కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే.. కేంద్రం ఆ భూమి కేటాయించలేదని మనసులో పెట్టుకున్న కేసీఆర్, వికారాబాద్‌లో నేవీ రాడార్ స్టేషన్‌కు భూములు కేటాయించకుండా వదిలేశారని పలువురు సీనియర్ అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని అన్నారు. ట్రాఫిక్ రద్ధీని తగ్గించేందుకు డబుల్ డెక్కర్ రైలు బ్రిడ్జీలను నిర్మించుకునేందుకు సహకరిస్తామని, ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ కోరినా పెడచెవిన పెట్టారని ఒక అధికారి తెలిపారు.
అవసరానికే తెరుచుకున్న గేట్లు
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలకు ప్రగతి భవన్ గేట్లు తెరిచిన కేసీఆర్, ఎన్నికలు పూర్తయి, అవసరం తీరగానే గేట్లు మూసి వేయించారనే విమర్శలు ఉన్నాయి. ఈ అవమానాన్ని కమ్యూనిస్టు నాయకులు బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోయారు. తెలంగాణ ప్రజలు, పాలకులకు గుండెకాయ లాంటి సచివాలయం నిర్మాణం పై ఏ ఒక్కరి సలహా, సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్మాణం చేయించారనే విమర్శలు ఉన్నాయి. రూ.1,500 కోట్లు వెచ్చించి సచివాలయం నిర్మించినా.. అందులో అరకొర వసతులే ఉండటంతో రాజభవనంలా కట్టిన ఆ కట్టడం ఇరుకుగా మారిందని సచివాలయ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. ‘వాహనాల పార్కింగ్ కోసం అనువై స్థలమే లేదు. ఉద్యోగులు పనిచేసుకునేందుకు అనువైన వాతావరణం లేదు. తన లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలా ఆరంతస్తుల సచివాలయం ఇరుకుగా, నాసిరకంగా నిర్మాణం చేయించారు’ అని సచివాలయ ఉద్యోగి ఒకరు అన్నారు.
ప్రొటోకాల్‌లోనూ ఆధిపత్య ధోరణి
రాష్ట్రానికి ప్రధాని వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా విమానాశ్రయానికి వెళ్లి ఆహ్వానించకుండా నగర మంత్రులను పంపించడం వారిని అవమానించడం కిందకే వస్తుందని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ‘ప్రధాన మంత్రి, హోం మంత్రిపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసి, ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చేవారు. ప్రధాని హైదరాబాద్ వచ్చిన సమయంలో నల్ల జెండాలు, బెలూన్లను ఎగురవేయించడం, హోర్డింగ్‌లు పెట్టించి అవమాన పర్చడం సంప్రదాయంగా చేసుకున్నారు’ అని ఆయన గుర్తు చేశారు.
ప్రజలను కలుస్తున్న రేవంత్.. కేంద్రంతోనూ పనులు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తన మార్క్ పరిపాలన చేస్తున్నారనే అభిప్రాయం సీనియర్ ఐఏఎస్‌లలో వ్యక్తమవుతున్నది. ‘జిల్లాల పర్యటనలు చేస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పాయింట్‌మెంట్‌లు ఇస్తున్నారు. ముఖ్యమైన సందర్భాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో భేటీ అవుతున్నారు. సచివాలయానికి రాకపోయినా తన ఇంటి వద్ద పలువురితో మాట్లాడుతున్నారు. బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల అధిపతులతో సమావేశమై ఆదేశాలు జారీ చేస్తున్నారు. సచివాలయం, అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుత పాలన అందిస్తుందని, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని స్పష్టంగా చెప్పడమే కాదు.. ఆచరణలోనూ చూపుతున్నారు’ అని ఆయన చెప్పారు.
జాతీయ పార్టీ నేతలను కలవొద్దా?
రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు 42 సార్లు పైగా ఢిల్లీ వెళ్లి వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు రోజులు ఉంటే, మరికొన్ని సందర్భాల్లో మూడు నాలుగు రోజులు ఉండి పార్టీ పనులతోపాటు.. కేంద్రంలో పెండింగ్ పనులు చక్కదిద్దుకుంటున్నారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పనిలో పనిగా ప్రధాన మంత్రి, హోం మంత్రి, రక్షణ మంత్రి తో పాటు ఇతర మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సిన పనులకు ఆమోద ముద్ర వేయించుకుని వస్తున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కావడంతో ఢిల్లీలో పెద్దలు ఉండరు. విశేషం ఏమిటంటే.. తమకు ఢిల్లీలో పెద్దలు లేరని, తాము ప్రజల సేవలకులమని చెప్పుకొన్న కేసీఆర్.. కనీసం ఆ ప్రజలను కూడా కలిసింది లేదని పలువురు పరిశీలకులు చెబుతున్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా ప్రజలను కలవాల్సిన అవసరం ఏంటని పలుమార్లు అప్పటి మునిసిపల్ మంత్రి కేటీఆర్ స్వయంగా వ్యాఖ్యానించారంటే.. వారి ఆలోచనా ధోరణిని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. దీనికి భిన్నంగా.. రాష్ట్రానికి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఇతర మంత్రులు వచ్చిన సందర్భాల్లో ప్రొటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలను రేవంత్‌రెడ్డి ఇస్తున్నారని చెబుతున్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటే విమర్శలు చేస్తున్నామని, అలాగని కక్షపూరితంగా ప్రవర్తించడం లేదని రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో ప్రకటించారు. పార్టీ పనులతో పాటు కేంద్రం పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్నానని, స్వంత పనులు చక్కదిద్దుకోవడానికి కాదని రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం నేతకు చురకలంటించారు కూడా.
హైదరాబాద్ మహా నగరంలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం మిలిటరీ భూములు అడ్డంకిగా ఉన్నాయి. వీటికి ఆమోద ముద్ర వేయించి, మార్గం సుగమం చేయడంతో సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఫ్లైఓవర్ ను నిర్మించనున్నారు. వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్ కు భూములు, స్థానిక అనుమతులు ఇవ్వడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం సై అనడంతో, వరంగల్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం రాబోతున్నది. ఇలా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న పనుల పరిష్కారం కోసం రాష్ట్ర ఎంపీలతో కలిసి వెళ్తున్నా అయినా విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు.
సచివాలయంలో ప్రజా సందర్శన కొనసాగించాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సచివాలయంలో సందర్శకులకు కలిసేందుకు ప్రత్యేక సమయం పాటించేవారు. హైదరాబాద్ నగరంలో ఉన్నట్లయితే ఉదయం ఇంటి వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమయం కేటాయించేవారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐదు గంటల వరకు పలువురికి అపాయింట్‌మెంట్లు ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఈ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా సంఘాల నాయకులు, ఇతర రాష్ట్రాల వారు ముఖ్యమంత్రులను కలుసుకునేవారు. ఈ విధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇచ్చే ఐదు నిమిషాల సమయంలో సమస్యలు విన్నవించుకోవడంతో పాటు వినతి పత్రాలు అందచేసే అవకాశం లభిస్తుందని అంటున్నారు.