కాంగ్రెస్ కండువాతో.. BRS ఎమ్మెల్యే సన్న బియ్యం భోజనం

  • By: sr    news    Apr 08, 2025 6:09 PM IST
కాంగ్రెస్ కండువాతో.. BRS ఎమ్మెల్యే సన్న బియ్యం భోజనం

విధాత : కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు తప్పించుకునేందుకు కప్పదాటు ప్రకటనలతో నానా తంటాలు పడుతుండటం విదితమే. ఓ సారి పార్టీ మారలేదని..మరోసారి కేసీఆర్ ను కలిసి మాటామంతి చేసి పిల్లిమొగ్గలేస్తున్నారు. కోర్టుల్లో మాత్రం తాము అభివృద్ధి పనులకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని అఫిడవిట్ లో చెబుతున్నారు. ఇలా పార్టీ మార్పుపై భిన్న రకాలుగా సర్కస్ ఫీట్లు చేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడపదడపా తమ అసలు స్వరూపం బయటపెట్టుకుంటున్నారు.

తాజాగా కోరుట్ల బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకుని సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన వీడియో వైరల్ గా మారింది. అయితే సంజయ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంతి, మాజీ ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డిపై ఈ సందర్భంగా విమర్శలు చేయడం ఆసక్తి రేపింది. ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులను జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో తాను కలిసి పనిచేస్తే జీవన్ రెడ్డికి అసహనం ఎందుకు అని సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.

జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో ఆయనకు అదే చివరి ఎన్నిక అని చెప్పుకున్నారని..అలాంటప్పుడు భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మేం ఇంకా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని..సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో తాను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని అసలు ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఫిరాయింపు ఎమ్మెల్యేలే వార్తల్లో నిలుస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.