KTR | ఎమ్మెల్సీ కవితకు.. కేటీఆర్ మాస్ వార్నింగ్

KTR |
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఏ హోదాలో ఉన్నా.. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటది. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంది.. ఆఫీస్ బేరర్స్ ఉన్నారు.. వారిని కూడా కలిసే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాలు అంతర్గతంగానే మాట్లాడితే బాగుంటుంది.. ఇది అందరికీ వర్తిస్తుంది. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు.. అందులో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండొచ్చు అని కేటీఆర్ అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండడంతో తక్షణమే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులు కవిత అంశాన్ని ప్రస్తావించారు. దీంతో కేటీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేస్తూ.. మళ్లీ సర్దుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి తమ పార్టీలో ప్రజాస్వామ్యస్ఫూర్తి ఉందంటూ.. కవిత వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ.. స్మాల్ వార్నింగ్ ఇచ్చారు. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటది అని కేటీఆర్ హెచ్చరించారు.
తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్.. దెయ్యం రేవంత్ రెడ్డి.. ఈ దెయ్యాన్ని, శనిని ఎలా వదిలించాలనేది మా టార్గెట్. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు పెట్టాం.. అసెంబ్లీలో ఓడిపోయాం.. ఎలా ముందుకు పోవాలని 17 రోజుల పాటు వేల మంది కార్యకర్తలతో చర్చించాం. ఆ ప్రాసెస్‌లో చాలా మంది డైరెక్ట్‌గా మైక్‌లో మాట్లాడిన వారు ఉన్నారు. కొంత మంది చిట్టీల మీద రాసిచ్చిన వారు ఉన్నారు. కొంత మంది కేసీఆర్‌కు ఉత్తరం అందించండి అని ఉత్తరాలు ఇచ్చిన వారు ఉన్నారు. మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది. మా పార్టీ అధ్యక్షుడికి ఏవైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి.. సూచనలు సలహాలు చేస్తూ అధ్యక్షుడికి లిఖిత పూర్వకంగా, ఓరల్‌గా ఇవ్వొచ్చు అని కేటీఆర్ పేర్కొన్నారు.
కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతమైన నేపథ్యంలో ఆమె నిన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మాట్లాడుతూ.. రెండు వారాల క్రితం కేసీఆర్‌కు లేఖ రాసిన. గతంలోనూ పలుమార్లు నా అభిప్రాయాలను లేఖ ద్వారా చెప్పిన. అయితే కేసీఆర్‌కు అంతర్గతంగా రాసిన ఉత్తరం బహిర్గతమైంది. దీనినిబట్టి ఏం జరుగుతున్నదో మనందరం, తెలంగాణలోని అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. నేను కేసీఆర్‌గారి కూతురిని, అంతరంగికంగా నేను రాసిన లేఖను బయటకు తీశారంటే ఇతరుల పరిస్థితి ఏమిటన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అని కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.