Kaleshwaram Project | కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ : సీఎం రేవంత్ రెడ్డి

Kaleshwaram Project | కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు అప్పగించాలని తీర్మానం చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చకు ఆదివారం దాటిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేవారని, కానీ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ప్రతిపక్ష సభ్యులకు అడిగినదానికంటే ఎక్కువ సమయం కేటాయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. జస్టిస్ పీసీ ఘోష్ అనేక కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చారన్న సీఎం.. నివేదికలో ఏమైనా లోపాలుంటే వాటి గురించి మాట్లాడాలని.. కానీ.. జస్టిస్ పీసీ ఘోష్‌ను తక్కువ చేసి మాట్లాడటం సభ హుందాతనానికి మంచిదికాదని బీఆరెస్ నేతలకు చురకలు వేశారు.
నీరు మనిషి ప్రగతికి సూచికని, అభివృద్దికి జీవనాడి అని చెప్పారు. నీటి చుట్టూ చరిత్రలో అనేక ఘటనలు జరిగాయన్నారు. కాకతీయులు 30 వేల గొలుసుకట్టు చెరువులు నిర్మించారని గుర్తు చేశారు. నిర్మాణం సమయంలో నాణ్యత పాటిస్తే వందల ఏళ్లు దాటినా ప్రాజెక్టులు సజీవంగా ఉంటాయన్నారు. ఇందుకు కామారెడ్డిలోని పోచారం ప్రాజెక్టును సీఎం నిదర్శనంగా చూపారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుప్పకూలిందన్నారు.
1975లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు, మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి ఎస్ బీ చవాన్ మధ్య ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మరోసారి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. 2008లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించి 2014 వరకు రూ. 6,100 కోట్లు ఖర్చు చేశారని, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. సర్కార్ మరో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసిందని ప్రస్తావించారు. కానీ, రాత్రికి రాత్రే ప్రాజెక్టు రీ డిజైన్ల పేరుతో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు శాపంగా మారాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తులో నిర్మించుకునేందుకు మహారాష్ట్ర సానుకూలంగా ఉందని, ప్రాణహిత వద్ద 235 టీఎంసీల నీరు ఉందని సీడబ్ల్యూసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతూ.. అప్పటి కేంద్ర జల్‌శక్తి మంత్రి ఉమా భారతి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.
మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి వ్యాప్కోస్‌ను కేసీఆర్ ప్రభుత్వం రిపోర్టు కోరిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎల్లంపల్లికి ఒక్క లిఫ్ట్ ద్వారా నీటిని తెచ్చుకోవచ్చని చెబితే.. బరాజ్, పంప్ స్థలాలు మార్చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఎత్తిపోతల పథకాలు చేపట్టారని విమర్శించారు. ఏ కాంట్రాక్టుల కోసం పంపులు, లిఫ్టులు పెంచారో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని ఎన్డీఎస్ఏ చెప్పిందని సీఎం గుర్తు చేశారు. టెక్నికల్ అంశాల మార్పు వల్లే బరాజ్‌లు కుంగిపోయాయని అన్నారు. తరతరాలపాటు శ్రీమంతులుగా ఉండాలనే దురాశతోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదంతా చేసిందని రేవంత్ ఆరోపించారు.
మేడిగడ్డ లోపాలపై 2020 మేలోనే కాళేశ్వరం ఇంజినీర్ రమణారెడ్డి లేఖ రాశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉందని, జరిగిన నష్టాన్ని
సరిదిద్దలేదని చెప్పారు. చివరకు మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. మేడిగడ్డ కుంగిన తర్వాత అక్కడికి ఎవరినీ పోనీయకుండా పోలీసులతో అడ్డుకున్నారన్నారు. ‘మీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ కుంగిన ప్రాంతాన్ని నేను, రాహుల్ గాంధీ పరిశీలించి అప్పుడే జ్యుడిషియల్ విచారణచేస్తామని హామీ ఇచ్చాం’ అని గుర్తు చేశారు.
పుట్టుకతోనే దొర అని చెప్పుకొనే కేసీఆర్ ప్రజలను దోచుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు స్థలం మార్చడంతో పాటు మూడు బరాజ్ అంచనాలను పెంచారన్నారు. ఎఐబీపీ పథకంలో ప్రాణహిత ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు 2013లో కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఏఐబీపీ కింద నిర్మించే ప్రాజెక్టులకు కేంద్రం 75 శాతం, 25 శాతం రాష్ట్రం భరిస్తే సరిపోతోందన్నారు. కేంద్రం ఉచితంగా నిర్మించాల్సిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కేసీఆర్, హరీశ్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం కార్పోరేషన్ ద్వారా రూ. 85,437 కోట్లు ఖర్చు చేస్తే అప్పులకు గాను ఇప్పటివరకు అసలు, వడ్డీ కలిపి రూ.49, 835 కోట్లు చెల్లించినట్టు సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుపై చేసిన అప్పుల విషయమై ప్రధానిని కలిసి రూ.26 వేల కోట్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయించినట్టు తెలిపారు.
కేసీఆర్, హరీశ్ రావు ఇంత చేస్తున్నా అప్పటి ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ చూస్తూ కూర్చున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి 8 లక్షల కోట్ల అప్పులు ఎలా వచ్చింది… కేసీఆర్ కుటుంబ సభ్యులకు రూ. 1 లక్ష కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్ లు, టీవీలు, పేపర్లు ఎలా వచ్చాయన్నారు. 5 ఏళ్లలో 162 టీఎంసీలు లిఫ్ట్ చేస్తే రూ.9500 కోట్లు విద్యుత్ బిల్లుల కింద ఖర్చు అయిందని ఆయన అన్నారు.