Pawan Kalyan: కాంగ్రెస్‌, మరెవరికైనా.. పాకిస్తాన్‌పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి

  • By: sr    news    Apr 29, 2025 3:31 PM IST
Pawan Kalyan: కాంగ్రెస్‌, మరెవరికైనా.. పాకిస్తాన్‌పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి

Pawan Kalyan:

విధాత: కాంగ్రెస్‌ నాయకులకు గానీ.. మరెవరికైనా పాకిస్థాన్ పై అంత ప్రేమ ఉంటే భారత్‌ను వదిలి అక్కడికే వెళ్ళిపోయి అక్కడే బతకండని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ పై దాడి జరిగితే సెక్యూలరిజమని చెప్పి పాకిస్తాన్ మద్ధతుగా మాట్లాడటాన్ని ఎవరు అంగీకరించబోరన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌లో హాలులో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

ఉగ్రఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పాకిస్తాన్ పట్ల అనుసరించే విధానంపై కాంగ్రెస్ నేతల్లోనే విభేధాలున్నాయని విమర్శించారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలని.. చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారని ప్రశ్నించారు.

కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్‌కు వెళ్తే చంపేశారని.. కశ్మీర్‌ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి? అని పవన్ ప్రశ్నించారు. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు.