Waqf Act: వక్ఫ్ చట్టం అమలు ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత: ఈటల

Waqf Act
విధాత: రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి వక్ఫ్ సవరణ చట్టం అమలు చేయను అనడం రాజ్యాంగ ఉల్లంఘన అని బీజేపీ మల్కజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై బోడుప్పల్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం జనజాగరణ అభియాన్ లో ముఖ్య అతిథిగా హాజరై ఈటల మాట్లాడారు. రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. చట్టాల అమలు ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు. వక్ఫ్ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని దీనివల్ల నిజమైన ముస్లిం పేదలకు లాభం జరుగుతుందన్నారు. ఒక్క బోడుప్పల్ లోనే పదివేలమంది వక్ఫ్ బాధితులున్నారన్నారు. వక్ఫ్ ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు.
సెలెక్ట్ కమిటీలో అన్ని పార్టీల వారు మంచి చెడు తర్కించుకొని రిపోర్ట్ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా వక్ఫ్ కి అంతర్గతంగా మద్దతు తెలిపారన్నారు. 1954, 1995, 2013 చట్టాలు చూశామని, అనేక మంది బాధలకు పరిష్కారం వక్ఫ్ చట్టం సవరణ అన్నారు. బోడుప్పల్ లో స్థలం కొన్నప్పుడు, ఇళ్లు కట్టుకున్నప్పుడు అన్ని అనుమతులు ఇచ్చి , 2018 లో వక్ఫ్ భూమి అని ప్రకటించడం సబబా అని ప్రశ్నించారు. పిల్లల పెళ్లిళ్లు చేసుకోలేక, అమ్ముకోలేక, తనఖా పెట్టుకోలేక గోస పడుతున్నారన్నారు. జహీరాబాద్ లో తరతరాలుగా దున్నుకుంటున్న భూముల్లో ఇప్పుడు వక్ఫ్ భూమి అని బోర్డు పెడుతున్నారని తెలిపారు.
వక్ఫ్ చట్టం ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. మసీదులు, దేవాలయాల కమిటీలు వేరు.. చారిటబుల్ ట్రస్ట్ లు వేరని గుర్తు చేశారు. చారిటబుల్ ట్రస్ట్ లలో ఏ మతం కులం వారైనా ఉండవచ్చన్నారు. బీజేపీ కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ కాదని, దేశహితం కోసం పుట్టిన పార్టీ అని చెప్పారు. 1951, 57, 62, 67 లలో జరిగిన ఎన్నికల్లో లోకసభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయన్నారు. దేశంలో ఒకే సారి ఎన్నికలు జరగాలని అప్పుడే మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ మనదని చెప్పుకొచ్చారు. సచార్ కమిటీ ముస్లింల జీవన స్థితిగతులమీద రిపోర్ట్ ఇచ్చిందని..వక్ఫ్ బోర్డు వారి జీవితాలు మార్చడం లేదన్నారు. కొద్దిమంది జల్సాలకు ఈ బోర్డుకింద ఉన్న భూములు ఉపయోగపడుతున్నాయన్నారు. 80 శాతం ముస్లింలు వక్ఫ్ బోర్డు ఆస్తులు బయటికి తీసి పేదలకు పంచాలి అని కోరుతున్నారు.
20 ఏళ్ల పాటు వక్ఫ్ బోర్డు భూమి మీద నిర్ణయం తీసుకోకపోతే అది అన్యాయం కాదా అని.. న్యాయమూర్తులు మీరు కూడా ఆలోచన చేయండన్నారు. కోర్టులు పరిష్కారం చూపకపోతే న్యాయం చేయాల్సింది చట్ట సభలే కదా అన్నారు. బోడుప్పల్ ఆకృతి టౌన్ షిప్, మారుతీనగర్, ఘటకేసర్, పీర్జాదిగూడ వక్ఫ్ బాధితులు ఈటల రాజేందర్ కి వినతిపత్రాలు అందించారు. హెచ్ఎండీఏ కమీషనర్, అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కూడా ప్రాసిక్యూట్ చేయండని విజ్ఞప్తిలో కోరారు. బాధితులని భయపడవద్దని ఈటల రాజేందర్ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాయకులు మహబూబ్ పాషా మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహబూబ్ పాషా, మాజీ ఎంపీపీ సుదర్శన్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రరెడ్డి, శోభారెడ్డి, కార్పొరేటర్ పవన్ రెడ్డి, విజయకుమార్, నరసింహ, మహేష్, రవి, గోనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.