6 నుంచి పత్తి కొనుగోళ్ళు బంద్.. రైతులకు తప్పని సీసీఐ కష్టాలు

పత్తి రైతులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే దిగుబడి తగ్గి దిగాలుపడిన రైతులకు అకాల వర్షాలు ఆశనిపాతంగా మారాయి. గోరుచుట్టు పైన రోకలి పోటు మాదిరి ఇప్పుడు పత్తి కొనుగోళ్ళు బంద్ చేస్తామంటూ తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరిక ఇప్పుడు శాపంగా మారనున్నది

  • By: Subbu |    news |    Published on : Nov 04, 2025 8:01 PM IST
6 నుంచి పత్తి కొనుగోళ్ళు బంద్.. రైతులకు తప్పని సీసీఐ కష్టాలు

విధాత, ప్రత్యేక ప్రతినిధి: పత్తి రైతులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే దిగుబడి తగ్గి దిగాలుపడిన రైతులకు అకాల వర్షాలు ఆశనిపాతంగా మారాయి. గోరుచుట్టు పైన రోకలి పోటు మాదిరి ఇప్పుడు పత్తి కొనుగోళ్ళు బంద్ చేస్తామంటూ తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరిక ఇప్పుడు శాపంగా మారనున్నది. ఈ నెల 6వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్ళు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్ యజమానులు, ట్రేడర్స్ అందరికీ అసోసియేషన్ పిలుపు నిచ్చింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అవలంబిస్తున్న ఎల్1, ఎల్ 2,ఎల్ 3 అలాట్మెంట్ పై అసోసియేషన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల అసమతుల్య అలాట్మెంట్ జరిగి చాలా మిల్లులు మూతపడే పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు.

ఈ ఏడాది తొలిసారి ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లలో ఇబ్బందుల ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఇబ్బందులపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ కార్యవర్గం సమావేశములో కూలంకశముగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీసీఐ అధికారులకు తెలియజేశామని అసోసియేషన్ పేర్కొంది. ఈ సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ పక్షాన గత నెల 30- న విన్నవించినట్లు పేర్కొన్నారు. తక్షణం ఈ సమస్యలు పరిష్కరించాలని కోరినప్పటికీ దీనిపై ఎటువంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. దీంతో అసోసియేషన్ నుండి ఈ నెల 2వ తేదీన రెండవ లేఖ ద్వారా తమ సమస్యలు వివరించామని వివరించారు. ఈ లేఖలో ఈ నెల 5వ తేదీ నాటి వరకు పరిష్కరించని పక్షంలో 6వ తేదీ గురువారం ప్రైవేటు, సిసిఐ పత్తి కొనుగోళ్లు నిరవధికముగా నిలిపివేయాలని తీర్మానించినట్లు స్పష్టం చేశారు. బుధవారం వరకు సమస్యలు పరిష్కరించని పక్షంలో గురువారం నుండి పత్తి కొనుగోళ్లు నిలిపివేసి సభ్యులందరూ ఐకమత్యంతో సహకరించి అసోసియేషన్ తీసుకున్న నిర్ణయమును అమలుపరచాలని కోరారు.

పత్తి రైతులకు ఇబ్బందులు

సీసీఐ అనుసరిస్తున్న కొత్త విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రవేటు వ్యాపారులు, జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లుల యజమానులు పత్తి కొనుగోళ్ళు నిలిపివేస్తే రైతుల పరిస్థితి దయనీయంగా మారనున్నది. ఇప్పటికే అకాల వర్షాలతో తడిసిపోయిన పత్తిని అమ్ముకోలేని దుస్థితిలో రైతులున్నారు. 12 శాతం మించి తేమ ఉంటే సీసీఐ కూడా పత్తిని కొనుగోలు చేయడంలేదు. ఈ స్థితిలో సీసీఐతోపాటు, ప్రైవేటు కొనుగోళ్ళను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం శాపంగా మారనున్నది. బుధవారం వరకు సమయం ఉన్నందున ప్రభుత్వం జోక్యం చేసుకుని సీసీఐని ఒప్పంచి ఏదైనా పరిష్కారం చూపెడితే తప్ప గురువారం నుంచి కొనుగోళ్ళు జరుగుతాయి. లేకుంటే పత్తి రైతులకు అవస్థలు తప్పేట్లు లేవు.

ఇవి కూడా చదవండీ:అక్రమ రవాణాపై పోలీసుల నిర్లక్ష్యం.. ఎంవీ యాక్ట్ స్వంత ప్రయోజనాలకేనా!