అక్రమ రవాణాపై పోలీసుల నిర్లక్ష్యం.. ఎంవీ యాక్ట్ స్వంత ప్రయోజనాలకేనా!
రాష్ట్రంలో శాంతి భద్రతల పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం తనిఖీ చేసి, కేసులు నమోదు చేసే అధికారాలు ఉన్నాయి. తమ స్వప్రయోజనాల కోసం అధికారాలను ఉపయోగిస్తున్నారని, ప్రజా భద్రత కోసం ప్రయోగించడం లేదని రవాణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు
హైదరాబాద్, విధాత: రాష్ట్రంలో శాంతి భద్రతల పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం తనిఖీ చేసి, కేసులు నమోదు చేసే అధికారాలు ఉన్నాయి. తమ స్వప్రయోజనాల కోసం అధికారాలను ఉపయోగిస్తున్నారని, ప్రజా భద్రత కోసం ప్రయోగించడం లేదని రవాణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. తనిఖీలు చేసి కేసులు నమోదు చేసే సమయం లేనప్పుడు అధికారాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ పేరుతో వాహన యజమానులపై ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, అధిక లోడ్ తో వెళ్తున్న ఇసుక, కంకర, రోబో శాండ్ లారీలు, టిప్పర్లను ఎందుకు అదుపు చేయడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
చేవెళ్ల మండలం ఖానాపూర్ గేట్ సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఆర్టీసీ బస్సును కంకర లోడుతో ఉన్న టిప్పర్ బలంగా ఢీకొట్టి 19 మంది మృతి కి కారణమైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో పలువురు గాయాల పాలై పలు ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలలో నిర్మాణ రంగం పనులు జోరుగా జరుగుతున్నాయి. నిర్మాణ రంగానికి అవసరం అయ్యే ఇసుక, కంకర, రోబో శాండ్, ఇటుకలు ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేస్తారు. ఇసుక అయితే సూర్యాపేట, ములుగు జిల్లాలతో పాటు ఏపీలో ని కర్నూలు నుంచి లారీలు, టిప్పర్లలో తరలిస్తారు. కంకర కూడా సమీప ప్రాంతం లేదా స్వంత ప్లాంట్లు ఉన్న ఏరియాల నుంచి పంపిస్తుంటారు. రోబో శాండ్ కూడా ఇదే తరహాలో రవాణా చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ పటాన్ చెరు సమీపంలోని లక్డారం నుంచి తాండూర్ కు కంకరతో వెళ్తున్నది. సుమారు వంద కిలోమీటర్ల దూరం వరకు కంకర ఎలా అనుమతించారో గనుల శాఖ అధికారులకే తెలియాలి. రవాణా శాఖ పర్మిషన్ లభించినా, గనుల శాఖకు నియంత్రించే అధికారాలు ఉన్నాయి. కంకర, రోబో శాండ్ ఎంత దూరం వరకు తీసుకువెళ్లవచ్చనే అంశంపై స్పష్టమైన నిబంధనలు లేవు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికైనా 25 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే రవాణా చేసేలా నిబంధనలు తీసుకువస్తే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
కేసుల నమోదులో పోలీసులు దాటవేత
రవాణా శాఖలో పనిచేస్తున్న మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (ఏఎంవీఐ) లకు ఉన్న అధికారులను శాంతి భద్రతల సీఐ, ట్రాఫిక్ ఎస్సై లకు బదలాయించారు. 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లు, వాహన రిజిస్ట్రేషన్, బీమా, ట్రాఫిక్ నిబంధనల అమలు, జరిమానాలు విధించచ్చు. ఈ చట్టం రోడ్డు రవాణాకు సంబంధించిన అన్ని అంశాలను నియంత్రిస్తుంది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి వరకు, కొన్ని ప్రాంతాల్లో తెల్లవారు జాము వరకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాటితో పాటు అధిక లోడ్ తో వెళ్లే టిప్పర్లు, లారీలను కూడా తనిఖీ చేయవచ్చు. వాహనాన్ని నడిపే డ్రైవర్ కు లైసెన్స్, వాహన ఫిట్ నెస్ సర్టిఫికెట్, హెడ్ లైట్లు ఇలా పలు అంశాలపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేసే అధికారం ఉంది. శాంతి భద్రతల సీఐలు, ట్రాఫిక్ ఎస్సైలు తమకున్న అధికారాలను ఉపయోగించడం లేదు. నోరు లేని తాగుబోతులపై మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసి తమ లక్ష్యాలను పూర్తి చేసుకుంటూ ప్రభుత్వ ఖజానా నింపే పనిలో నిమగ్నమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. మద్యం సేవించి తన ఆరోగ్యం చెడగొట్టుకోవడమే కాకుండా, డ్రంకన్ డ్రైవ్ కేసుతో మరింత నష్టపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. డ్రంకన్ డ్రైవ్ విషయంలో ఎంత కఠినంగా ఉన్నారో అంతకన్నా కఠినంగా ఇసుక, కంకర, రోబో శాండ్, ఇటుక లారీలు, టిప్పర్లపై ఉండాలని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. లారీలు, టిప్పర్ల యజమానులు ప్రతి నెలా సంబంధిత శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వడం మూలంగానే చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి టోల్ గేట్ వద్ద వెయింగ్ బ్రిడ్జీలు
నగరం చుట్టూ ఉన్న ఎనిమిది ప్రధాన రహదారులతో పాటు ఇవి ప్రయాణించే రోడ్లపై వేయింగ్ బ్రిడ్జీలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడే కాకుండా ప్రతి టోల్ గేట్ వద్ద వేయింగ్ బ్రిడ్జీ ఏర్పాటు చేస్తే జవాబుదారితనం, భయం పెరుగుతుందంటున్నారు. ఒక లారీ లేదా టిప్పర్ లో పరిమితికి మించి ఎంత అదనంగా తరలిస్తున్నారనేది అక్కడే తెలిసిపోతుంది. వాహనం కదిలిన పది నిమిషాల వ్యవధిలో యజమానికి ఎస్ఎంఎస్ వెళ్లేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపకల్పన చేయాలని కోరుతున్నారు. ఈ విధానం అమలు చేస్తే ఓవర్ లోడ్ సమస్య పూర్తిగా తగ్గుతుందని, స్పీడ్ కూడా తగ్గుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ రవాణా కమిషనర్ గా అశోక్ కుమార్ టిగిడీ పని చేసిన సమయంలో నగరం చుట్టూ ఉన్న ప్రధాన రోడ్ల ప్రవేశ ప్రాంతాల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతో అక్రమ రవాణా తగ్గడంతో పాటు రాత్రి పూట ప్రమాదాలు కూడా పూర్తిగా తగ్గాయని అంటున్నారు. మూడు నెలల పాటు నిరంతరం చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేయడంతో ఆగాయని, ఆ తరువాత మళ్లీ అక్రమ రవాణా మొదలైందంటున్నారు.
ఇవి కూడా చదవండీ:Jubilee Hills By-Election | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకే జనసేన మద్దతు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram