చేవెళ్ల లో బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ 20 మంది మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 20 మంది దుర్మరణం చెందారు మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

  • By: Tech |    hyderabad |    Published on : Nov 03, 2025 9:54 AM IST
చేవెళ్ల లో బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ 20 మంది మృతి

విధాత : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 20 మంది దుర్మరణం చెందారు మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమ‌వారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై ప్రయాణిస్తున్న టిప్పర్ లారీ, 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందగా.. 24 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో చేవెళ్ల–వికారాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. టిప్పర్ లారీ కంకర తో సహా బస్సు మీద పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మృతుల్లో 10 నెలల చిన్నారి కూడా ఉండటం విషాదం రేపింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

బస్సు టిప్పర్ ప్రమాదంలో మృతులు 19మంది

మీర్జాగూడ బస్సు టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో 19 మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. 20 మందికి గాయాలయ్యాయని.. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని.. చేవెళ్ల ఆసుపత్రిలో పదిమందికి చికిత్స కొనసాగుతుందని, మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో మరో 10 మందికి చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. మృతుల్లో పది మంది మహిళలు, మూడు నెలల చిన్నారి కూడా ఉన్నారని తెలిపింది. మృతుల్లో ఇద్దరు డ్రైవర్లతోపాటు ఆరుగురు పురుషులు ఉన్నారని వెల్లడించింది.తాండూర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన బస్సు లో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులే. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మృతి చెందారు. మృతులు అనూష, సాయి, ప్రియ నందినిలుగా గుర్తించారు.

ప్రమాదంలో 19 మంది మరణించారని, మరో 20 మంది కి తీవ్ర గాయాలయ్యాయని.. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఏడు లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.

మీర్జాగూడలో ప్రమాదానికి గురైన బస్సును ఆర్టీసీ హైర్ వెహికల్ (అద్దె)గా గుర్తించారు. డ్రైవర్ పేరు దస్తగిరి బాబా అని పోలీసులు తెలిపారు. బస్సు నంబర్ TG 34TA 6534. సోమవారం తెల్లవారుజామున 4.40 గంటలకు బస్సు తాండూరు బస్టాండ్ నుంచి బయల్దేరి, 6.15 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కండక్టర్ రాధ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆమె ఎడమవైపున కూర్చోవడం వల్లే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.