Breaking: RTI ప్రధాన కమిషనర్‌గా CS శాంతి కుమారి?

ఆర్టీఐ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ఖాళీల భర్తీపై నేడు సెలెక్షన్ కమిటీ భేటీ
విధాత ప్రత్యేకం: రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్, కమిషనర్ తో పాటు లోకాయుక్త, ఉప లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్, సభ్యుల ఎంపికపై ఇవాళ అంబేద్కర్ సచివాలయంలో సెలెక్షన్ కమిటీ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. మధ్యాహ్నం 12.30కి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్, సభ్యులు, 12.45 కు లోకాయుక్త, ఉప లోకాయుక్త, ఆ తరువాత ఒంటి గంటకు రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్, కమిషనర్ పదవుల భర్తీపై సెలక్షన్ కమిటీ సమావేశం ఖరారు అయ్యింది.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత కే.చంద్రశేఖర్ రావు, మరో సభ్యుడు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కే.చంద్రశేఖర్ హాజరవుతారా లేదా అనేది తెలియనప్పటికీ, మెజారిటీ సభ్యుల తీర్మానం ప్రకారం ఏజెండాలోని అంశాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. సమావేశం ఏజెండా అంశాలను సభ్యులకు ఇప్పటికే సాధారణ పరిపాలనా విభాగం పంపించింది. ఢిల్లీలోని కేంద్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ తో పాటు రాష్ట్రాలలో సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్, కమిషనర్ల పోస్టులను 8 వారాల్లోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 7న కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించింది.
ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా శాంతి కుమారి
రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ గా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆమె ఈ పదవి కోసం తనవంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారనే వార్త సచివాలయ వర్గాల్లో గత నెల రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇవాళ జరిగే సమావేశంలో ఆమోద ముద్ర పడిన వెంటనే ప్రధాన కార్యదర్శి పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఆమె ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది.
ఈ పోస్టు కోసం మరో ఆల్ ఇండియా సర్వీసు అధికారి పోటీపడుతున్నారు. గతేడాది జూన్ నెలలో ఈ పదవుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. పలువురు జర్నలిస్టులు, న్యాయవాదులు, పదవీ విరమణ చేసిన అధికారులు ఈ పదవుల కోసం దరఖాస్తు సమర్పించగా వాటిని వడపోసి, అర్హులైన వారితో జాబితాను సిద్ధం చేశారు. లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ గా పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జీలను ఎంపిక చేయనున్నారు.