ధరణి.. KCR కుటుంబం దోపిడీ సాధనం: మంత్రి పొంగులేటి

విధాత: ధరణి చట్టాన్ని కేసీఆర్ కుటుంబం దోపిడీకి సాధనంగా మార్చుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో భూభారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సి శంకర్ నాయక్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠిలు సదస్సుకు హాజరయ్యారు. సదస్సు అనంతరం మీడియాతో పొంగులేటి మాట్లాడారు. గతంలో ధరణితో ఎవరైతే భూములు కోల్పోయారో వారందరితో పాటు భూములున్న రైతులకు భద్రత కల్పించేందుకే భూ భారతి చట్టాన్ని తెచ్చామన్నారు. ధరణితో ఏర్పడిన భూవివాదాలతో పాటు అన్ని రకాల భూ వివాదాలను భూ భారతి చట్టం ద్వారా పరిష్కరించబడుతాయన్నారు. ధరణి కేసీఆర్ కుటుంబం కోసం తెచ్చిన చట్టమైతే..మేం లక్షల మంది అభిప్రాయాలు సేకరించి రూపోందించిన చట్టం భూభారతి అని పొంగులేటి చెప్పుకొచ్చారు. నేను అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు బయటపెడుతానంటున్న కేటీఆర్ నిజంగా మగాడివైతే వాటిని ప్రజల ముందుంచాలని పొంగులేటి సవాల్ చేశారు. ఆధారాలు ఉంటే ప్రతిపక్షం ఎందుకు దాచుకుంటుందని ఎద్దేవా చేశారు.
గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు
జూన్ 2 నుండి ప్రతి గ్రామానికి తహశీల్దార్ స్థాయి అధికారులు వచ్చి భూ సమస్యల పై దరఖాస్తులు తీసుకుంటారని, రైతులు ఒక రూపాయి కూడా చెల్లించకుండా రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రైతుల భూముల సర్వే కోసం 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నామని, ప్రతి గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి చొప్పున 10695 మందిని వచ్చే నెల మొదటివారం నుండి పంపించనున్నామని ఆయన వెల్ల డించారు. ప్రతి మనిషికి ఆధార్ లాగే భూదార్ కార్డు ను ఇచ్చి ఖాతా నెంబర్ ను ఇవ్వనున్నమన్నారు.
గతంలో భూములు అమ్మిన, కొన్న మ్యాపింగ్ లేదని, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ ను త ప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. సాదా బైనామాలకు ధరణిలో ఎలాంటి అవకాశం లేద ని, భూ భారతిలో వీటిని పరిష్కరించనున్నామని, తొమ్మిది లక్షల 26 వేల సాదా బైనామా దరఖాస్తులున్నాయని, వాటిలో న్యాయమైన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.
రెవెన్యూ అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం
చందంపేటలో భూభారతిపై అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డారు. సదస్సులో రైతులు తమ భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల ఫిర్యాదుతో ఆర్డీవో రమాణారెడ్డి, తహశీల్దార్‌లను మంత్రి ప్రశ్నలు అడగగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో రెవెన్యూ డివిజన్‌పై ఏమాత్రం అవగాహన లేకుండా ఎలా ఉన్నారని ఆర్డీవోపై పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజల్లో తిరుగాలని సూచించారు. ప్రజల్లో తిరిగితే వారి సమస్యలు తెలుస్తాయని..పరిష్కార మార్గాలు బోధపడుతాయని హితవు పలికారు.