National Herald case | సోనియా, రాహుల్ రూ.142కోట్లు లబ్ధి పొందారు : ఈడీ సంచలన ఆరోపణలు

National Herald case | నేషన్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ ద్వారా వారు రూ.142కోట్లు లబ్ధి పొందారని కీలక ఆరోపణలు చేసింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లయింట్‌పై విచారణ కొనసాగింది. బుధవారం జరిగిన విచారణలో ఈడీ తన వాదనలు వినిపించింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు నిందితులు మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పేర్కొంది.
ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పేర్లతో పాటు పలువురి పేర్లను ఈడీ ప్రస్తావించింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహించారన్న ఫిర్యాదులపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టగా.. మధ్యలోనే సీబీఐ దర్యాప్తు ఆగిపోయింది. అయితే ఈడీ మనీలాండరింగ్ పై దర్యాప్తు కొనసాగిస్తున్నది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను పలుమార్లు విచారించింది.
ఈ కేసులో 2023 నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి నోటీసులు సైతం జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెకు ఉంటున్నవారు ఇకపై తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది.