Gen Z AI Tools | జెన్‌ జెడ్‌ (Gen Z) AI వాడకంలో ముందున్నదీ వారే.. నష్టపోతున్నదీ వారే!

AI (కృత్రిమ మేధ)ను అత్యంత వేగంగా అవగాహన చేసుకున్న, అనుసరిస్తున్న తరం జెన్‌జెడ్‌ (Gen Z). కంటెంట్‌ సృష్టించడం మొదలుకుని.. ఉద్యోగ automation వరకు వీరు ముందుంటున్నారు. కానీ తాజా అధ్యయనాలు ఈ తరం పెద్దగా లాభపడటం లేదని, పైగా వారిని ఇంటికి పంపేస్తున్నాయని పేర్కొంటున్నాయి. చాలా వరకూ ఎంట్రీలెవల్‌ ఉద్యోగాలు వేగంగా ఏఐ సిస్టమ్స్‌ చేతిలోకి వెళ్లిపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

  • By: TAAZ    news    Sep 01, 2025 6:45 PM IST
Gen Z AI Tools | జెన్‌ జెడ్‌ (Gen Z) AI వాడకంలో ముందున్నదీ వారే.. నష్టపోతున్నదీ వారే!

Gen Z AI Tools | ఇంటర్నెట్‌తో పెరిగిన తరం! టెక్నాలజీని ఎంత ఈజీగా అంటే.. అంత ఈజీగా వాడేసే తరం! అదే జనరేషన్‌ జెడ్‌ (Gen Z). కంటెంట్‌ క్రియేషన్‌ నుంచి వర్క్‌ప్లేస్‌ ఆటోమేషన్‌ వరకు ఎలాంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ఏఐ టూల్స్‌ వాడకం వీరిలో మామూలుగా ఉండదు! కానీ.. విచిత్రమేంటంటే.. ఏ AI వాడకంలో ముందున్న ఈ తరమే.. దాని వల్ల నష్టపోతున్నవారిలోనూ ముందుంటున్నారట. అది కూడా తీవ్ర స్థాయిలో! ఎందుకంటారా?.. ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు అంటే.. సాధారణంగా నవ యువతే చేపట్టే పనులు వేగంగా ఆటోమేషన్‌ వల్ల మాయమైపోతున్నాయి.

1997 నుంచి 2012 మధ్య పుట్టినవారిని జెన్‌ జెడ్‌ అని పిలుస్తున్నారు. వీరి పుట్టుకతోనే డిజిటల్‌ పుట్టుక కూడా పారలల్‌గా ఉంది. దాంతో వారికి స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం సహజంగానే అబ్బాయి. ఇదే క్రమంలో ఏఐ టూల్స్‌ను కూడా వీరు చాలా సులభంగా, త్వరగా అలవాటు చేసుకున్నారు.

అధ్యయనాలు ఏమంటున్నాయి?
ఈ విషయంలో స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తాజాగా ఒక అధ్యయనం నిర్వహించింది. దాని ఫలితాలను విశ్లేషిస్తే.. విస్మయపర్చే వాస్తవాలు వెలుగు చూశాయి. 22 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న ఉద్యోగుల సంఖ్య ఏఐ ప్రభావిత రంగాల్లో 13 శాతం వరకూ తగ్గిందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ప్రత్యేకించి.. సాఫ్ట్‌వేర్‌, కస్టమర్‌ సర్వీస్‌, క్లరికల్‌ వర్క్‌ వంటి రంగాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. మరో విచిత్రం ఏమిటంటే.. కొంత ఎక్కువ వయసున్న ఉద్యోగుల సంఖ్య మాత్రం.. స్థిరంగా కొనసాగడం లేదా కొన్ని సందర్భాల్లో పెరగడం నమోదైంది. దానికీ ఒక కారణం ఉంది. పెద్దవాళ్ల వద్ద ఉండే అనుభవం. ఈ అనుభవం వారికి కొన్నేళ్లపాటు ఆ రంగంలో ఉండటం వల్ల ప్రాక్టికల్‌గా కలిగిది. అవే చిట్కాలు, షార్ట్‌కట్‌లు, నైపుణ్యాలు వంటివి. అప్పటికప్పుడు పనిలో తమ అనుభవాన్ని వారు ఉపయోగిస్తూ ఉంటారు. దీనికి ఎక్కడా సిద్ధాంతాలూ, సూత్రాలూ ఏమీ ఉండవు. రాసి చెప్పడం, లేదా వివరించి చెప్పడం కూడా సాధ్యం కాదు. దీనిని అధిగమించడం ఏఐకి అంత సులభంగా లేదని చెబుతున్నారు.

ఏఐని ఎక్కువగా నమ్మే తరం.. Gen Z

  • Gen Zలో సుమారు 25 శాతం మంది ఉద్యోగులు పనిలో AIని రెగ్యులర్‌గా లేదా ఎక్కువ సమయం వినియోగిస్తున్నారని డెలాయిట్‌ సర్వే పేర్కొంటున్నది.
  • Gen Z యువకుల్లో 41 శాతం మంది తమ సహచరుల కంటే AIనే ఎక్కువగా నమ్ముతారని ఫోర్బ్స్‌ సర్వే చెబుతున్నది.
  • Gen X, బేబీ బూమర్స్‌తో పోల్చినా.. Gen Z అత్యధికంగా ఏఐతో ఇంటరాక్ట్‌ అవుతున్నది. Gen Z వారంలో సగటున 12 సార్లు AIతో ఇంటరాక్ట్‌ అవుతుంటే, Gen X (ఏడు సార్లు), బేబీ బూమర్స్‌ (నాలుగు సార్లు) మాత్రమే ఏఐని వాడుతున్నారు.

భారత యువతలో ఆందోళన
బీఎంఎల్‌ ముంజాల్‌ యూనివర్సిటీ 2024లో ఒక సర్వే నిర్వహించింది. అందులో.. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయంలో 44 శాతం Gen Z యువత ఉన్నరని తేలింది. 63% మంది దీర్ఘకాలిక స్థిరమైన ఉద్యోగాలు దొరకవనే ఆందోళన వ్యక్తం చేశారు.

మార్పు దిశగా అడుగులు
చాలామంది యువకులు ఇప్పుడు ఎలక్ట్రిషన్‌, ప్లంబింగ్‌, ల్యాండ్‌స్కేపింగ్‌ వంటి ఆటోమేషన్‌ ప్రభావం తక్కువగా ఉండే స్కిల్డ్‌ ట్రేడ్స్‌వైపు మళ్లుతున్నారని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ రిపోర్ట్‌ చెబుతున్నది. నిపుణుల సూచనలు, సలహాల ప్రకారం పాఠ్యాంశాల్లో మార్పులు, హైరింగ్‌ పాలసీలు మార్చని పక్షంలో ఈ తరం.. ‘లాస్ట్‌ జనరేషన్‌’గా మిగిలిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏమి చేయాలి?

ఏఐ రాక నేపథ్యంలో రాబోయే కాలంలో వివిధ యాజమాన్యాలు రొటీన్‌ ఉద్యోగాలను 40 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం (WEF) అంచనా వేసింది. దీనికి ఎక్కువగా ప్రభావితమయ్యేది Gen Z అని నిపుణులు చెబుతున్నారు.

AIని పూర్తిగా నిరోధించటం సాధ్యం కాదు. కానీ AIని సహాయకుడిగా మార్చుకోవాలి గానీ ప్రత్యామ్నాయంగా మార్చకూడదు. పాలసీలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ లాంటి మార్పులు ఈ తరాన్ని రక్షించగలవని నిపుణులు చెబుతున్నారు.

మొత్తం మీద, AI వాడకంలో ముందున్న జెన్‌ జెడ్‌ అదే ఏఐ దెబ్బకు విలవిల్లాడే పరిస్థితి రావడం కాల మహిమ!