Nano Banana | జపాన్‌లో ఇబ్బంది పడ్డ అమెరికన్ టూరిస్ట్‌.. తెల్లవారుజామున 4 గంటలకు గూగుల్ ఏఐ సూపర్ హెల్ప్!

Nano Banana | జపాన్‌లో భాష రాక ఇబ్బంది పడ్డ అమెరికన్ టూరిస్ట్‌కు గూగుల్ ఏఐ సూపర్ హెల్ప్ చేసింది. నానా బనానా చేసిన సాయాన్ని అతను సోషల్‌మీడియాలో పంచుకోవడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

Nano Banana | కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య.. భాష! మనం వెళ్లిన చోట వాడే భాష రాకపోతే కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రపంచంలో చాలా చోట్ల ఇంగ్లీష్ ఉంటుంది.. కానీ అదే జపాన్, చైనా వంటి దేశాలకు వెళ్తే పరిస్థితి ఏంటి.! ఇలాగే జపాన్‌కు వెళ్లిన ఓ అమెరికన్ టూరిస్ట్ లాంగ్వేజ్ రాక ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతనికి ఎంతగానో సాయం చేసింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికాకు చెందిన ఓ టూరిస్ట్ ఇటీవల జపాన్‌ టూర్‌ వెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో దిగాడు. అయితే గదిలో ఉక్కపోతగా ఉండటంతో తెల్లవారుజామున అతనికి మెలకువ వచ్చింది. ఏసీని అడ్జస్ట్ చేసుకుందామని రిమోట్ చూడగా.. మొత్తం జపనీస్ భాషలోనే ఉంది. అతనికి అందులో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అంత తెల్లవారుజామున హోటల్ సిబ్బందిని ఎలా పిలవాలి? ఏసీని ఎలా అడ్జస్ట్ చేయాలని కాసేపు ఆలోచించాడు. చివరకు అతనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ జెమినీలోని నానో బనానా ఫీచర్ హెల్ప్ తీసుకున్నాడు. రిమోట్ ఫొటోను తీసి, జపనీస్‌లో ఉన్న పదాలను ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి ఇవ్వమని ప్రాంప్ట్ ఇచ్చాడు. అంతే క్షణాల్లో ఇంగ్లీష్‌ అక్షరాలతో ఉన్న రిమోట్ ఫొటోను ఇచ్చింది. దీంతో టెంపరేచర్ కంట్రోల్, ఫ్యాన్ స్పీడ్, మోడ్ సెట్టింగ్స్, టైమర్స్ వంటి బటన్ల పనితీరును అర్థం చేసుకున్నాడు. దీని ఆధారంగా ఏసీ టెంపరేచర్‌ను అడ్జస్ట్ చేసుకున్నాడు. రూమ్ కూల్ అవ్వగానే హాయిగా నిద్రపోయాడు.

తన అనుభవాన్ని అమెరికన్ టూరిస్ట్ సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు భాష రాక కొన్ని సార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. కానీ దాన్ని ఏఐ అధిగమించిందని చెప్పుకొచ్చాడు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 

Latest News