HCU: BJP ఎమ్మెల్యేల అరెస్ట్.. ఉద్రికత

  • By: sr    news    Apr 01, 2025 2:13 PM IST
HCU: BJP ఎమ్మెల్యేల అరెస్ట్.. ఉద్రికత

HCU | BJP

విధాత: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయం నిర్ణయాన్ని వ్యతిరేకంగా యూనివర్సిటీ సందర్శనకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేల బృందాన్ని పోలీసులు ఎమ్మెల్యేల క్వార్టర్స్ వద్ధనే అడ్డగించి అరెస్టు చేశారు. బీజేపా శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్ లతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వివాదం, తోపులాటలతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల దగ్గరకు వెళ్లనివ్వకుండా బీజేపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

గత కొంత కాలంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములపై యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ పరిధిలోని 400ఎకరాల భూముల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వ వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఈ భూములు యూనివర్సిటీకి చెందినవి కావని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఆ భూములు యూనివర్సిటీవేనని వన్య ప్రాణులు, పక్షులు, జలవనరులు, వృక్ష సంపదతో జీవ వైవిధ్యానికి నెలవుగా ఉన్న వాటిని విక్రయించవద్ధని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ప్రవైటు కంపెనీకి కేటాయించిన ఈ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపోరాటంతో స్వాధీనం చేసుకుందని కాంగ్రెస్ గుర్తు చేస్తుంది. గచ్చిబౌలి భూమి విషయంలో బీఆర్ఎస్ ద్వంద వైఖరి అనుసరిస్తుందని ఆరోపించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే హెచ్ సీయూకి 1700 ఎకరాల భూమి అవసరం లేదని కోర్టుకు పోయిందని, అందులో నుంచి కనీసం 160 ఎకరాల భూమి అభివృద్ధికి కావాలని కోర్టును కోరిందన్న సంగతి మరిచి నేడు రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తుంది.