Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల‌కు ఆరెంజ్ ఆలర్ట్‌! పిడుగులు ప‌డే అవ‌కాశం

  • By: sr    news    Mar 22, 2025 3:53 PM IST
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల‌కు ఆరెంజ్ ఆలర్ట్‌! పిడుగులు ప‌డే అవ‌కాశం

Rain Alert | Telangana

విధాత: వాతావరణ శాఖ తెలంగాణకు శనివారం (మార్చి 22), ఆదివారం (మార్చి 23) వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీతోపాటు మోస్తరు వర్షం కురిసింది. పగలంతా ఎండ దంచికొట్టగా, సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. అల్వాల్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, కూకట్ పల్లి, బండ్లగూడ జాగిర్, మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గట్టి వర్షం పడింది. నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షం కురిసింది. శని, ఆదివారాల్లో సైతం ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ ఈరోజు(మార్చి 22) 7 జిల్లాలకు ఆరెంజ్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జనం బయటకు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ఈరోజుతో పాటు వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలకు తగ్గు ముఖం పడతాయని, మళ్లీ మూడు రోజుల తర్వాత ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో శుక్రవారం పలుచోట్లశ ఈదురుగాలులు, వడగండ్ల వాన అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.