Hyderabad Rains| హైదరాబాద్ ను ముంచెత్తిన వాన.. పలు చోట్ల భారీ వర్షం

Hyderabad Rains| హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. రోడ్ల మీద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
చాదర్ ఘాట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, బేగంపేట, అల్వాల్, సైదాబాద్, సంతోష్ నగర్ , యూసుఫ్ గూడ, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్ , కొత్తపేటల్లో భారీ వర్షం నమోదైంది.
మరోవైపు పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో కలాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోయింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బుధవారం తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అకాల వర్షం.. తడిసి ముద్దైన వరి ధాన్యం!
ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. తాజాగా అకాల వర్షాలు రైతన్నలను వరుసగా వెంటాడుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కుప్పలు తడవకుండా రక్షించుకోలేక నానా పాట్లు పడుతున్నారు. కొనుగోలు ఆలస్యం చేయడమే తాము అకాల వర్షాల బారిన పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తమ ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోగా, వర్షాల నుంచి ధాన్యం కుప్పలను రక్షించుకునేందుకు కవర్లు కూడా అందించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన ధాన్యం తీరా.. చేతికి అందేలోగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో తడిసి ముద్దైందనీ, ఇకనైనా ప్రభుత్వం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అతి త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ, మహాబూబ్ నగర్, నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. అలాగే కాంటా పూర్తయి మిల్లులకు వెళ్లాల్సిన ధాన్యం బస్తాలు కూడా ఎగుమతి సమస్యలతో ఆలస్యమై వర్షాల బారిన పడి తడిసిపోయాయి.
అప్రమత్తంగా ఉండండి
– అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో బుధవారం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలని సూచించారు. హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు.