40% Graduates Unemployed| దేశంలో యువ పట్టభద్రుల్లో 40 శాతం నిరుద్యోగులే…

దేశాన్ని నిరుద్యోగం గత నాలుగు దశాబ్దాలుగా పట్టిపీడిస్తూనే ఉన్నదని అజీజ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ రూపొందించిన నివేదిక వెల్లడించింది. విద్య స్థాయిలు పెరుగుతున్నా అందుకు అవసరమైన ఉద్యోగాలు కల్పించలేకపోవడంలో అంతరం కొనసాగుతున్నదని తెలిపింది. చాలా మందికి తగిన ఉద్యోగాలు లభించడం లేదని పేర్కొన్నది.

  • By: TAAZ |    national |    Published on : Mar 19, 2026 8:24 PM IST
40% Graduates Unemployed| దేశంలో యువ పట్టభద్రుల్లో 40 శాతం నిరుద్యోగులే…

40% Graduates Unemployed|  దేశంలో కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకుంటున్నప్పటికీ.. గణాంకాలు మాత్రం భిన్నమైన దృశ్యాన్ని చూపుతున్నాయి. దేశంలో యువ గ్రాడ్యుయేట్లలో సుమారు 40 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ‘ది స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2026’ పేరిట అజీజ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ నివేదికను విడుదల చేసింది. గత నాలుగు దశాబ్దాలుగా ఈ సంఖ్యలు పెద్దగా మారడం లేదని ఆ నివేదిక పేర్కొన్నది. గ్రాడ్యుయేట్లలో ప్రత్యేకించి 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కుల్లో అత్యధికంగా ఉన్నట్టు తెలిపింది. అందులోనూ 25 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కుల్లో 20 శాతం మంది ఉద్యోగం పొందే స్థితిలో లేరని వెల్లడించింది.

ఇదేమీ కొత్త ట్రెండ్‌ కాదని, గ్రాడ్యయేట్ నిరుద్యోగులు 1983 నుంచి 2013 సంవత్సరాల మధ్యకాలంలో 35 నుంచి 40 శాతం మధ్య ఉంటున్నారని అజీజ్‌ ప్రేమ్‌ జీ యూనివర్సిటీ నివేదిక పేర్కొన్నది. కొందరు గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందగలిగినప్పటికీ పర్మినెంట్‌ ఉద్యోగాలు పొందుతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నదని తెలిపింది.
అంతకు ముందు సంవత్సరం పట్టభద్రులైన యువతలో దాదాపు సగం మంది ఏదో ఒక ఉద్యోగాన్ని పొందగలుగుతున్నారని, కానీ.. చిన్నసంఖ్యలోవారికి మాత్రమే జీతంతో కూడిన శాశ్వత ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నది. ఏడు శాతం పట్టభద్రులు మాత్రమే ఏడాది కాలంలోనే జీతంతో కూడిన శాశ్వత ఉద్యోగం పొందుతున్నారని తెలిపింది.

పనిచేసే వయసున్న జనాభా 2030 నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నివేదిక పేర్కొన్నది. అదే సమయంలో ఏ విద్యను అభ్యసించాలనే విషయాన్ని ఆర్థిక ఒత్తిళ్లు ప్రభావితం చేస్తున్నాయని వెల్లడించింది. విద్య నేర్చుకునే యువత శాతం క్రమేణా తగ్గుతున్నదని తెలిపింది. 2017లో ఇది 38 శాతం ఉంటే.. 2024 చివరి నాటికి 34 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుటుంబాన్ని పోషించేందుకు చదువు మానేస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతున్నదని నివేదిక వెల్లడించింది.

అదే సమయంలో 15 నుంచి 24 ఏళ్ల మధ్య స్కూల్‌ డ్రాపౌట్స్‌ సంఖ్య కూడా పెరుగుతున్నది. 2017లో ఇది 58 శాతం ఉంటే.. 2023 నాటికి అది 72 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొన్నది. కొవిడ్‌ తర్వాతి కాలంలో ఉపాధి అవకాశాలు పెరిగినప్పటికీ.. ఎక్కువగా వ్యవసాయ రంగంలోనే ఇవి ఉంటున్నాయని నివేదిక తెలిపింది. 2012–2022, 2023–24 మధ్య 8.3 కోట్ల ఉపాధి అవకాశాలు సృష్టించబడితే అందులో దాదాపు సగం.. అంటే నాలుగు కోట్ల ఉద్యోగాలు వ్యవసాయం రంగంలోనే ఉన్నాయని నివేదిక తెలిపింది. గతంలో యువ కార్మికులు వ్యవసాయం నుంచి తయారీ, సేవల రంగాలకు మారేవారని, అయితే.. ఇటీవల ఈ ధోరణిలో మార్పు కనిపిస్తున్నదని వెల్లడించింది. దేశంలో విద్య స్థాయిలు పెరుగుతున్నప్పటికీ.. అందుకు సరిపడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఈ అంతరం పెరుగుతున్నదని నివేదిక తేల్చింది.