HMDA : 25నుంచి హైదరాబాద్ లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
హైదరాబాద్‌లో వినాయక చవితి కోసం 25నుంచి 1లక్ష ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీ: హెచ్ఎండీఏ

HMDA | విధాత, హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి సందర్భంగా ఆదివారం 24వ తేదీ నుంచి 26వరకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లుగా హెచ్ఎండీఏ ప్రకటించింది. ఏకో గణేష్, గ్రీన్ గణేష్ నినాదంతో నగర వ్యాప్తంగా 8 ఇంచుల ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. నగర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 1లక్ష ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. 2017 నుంచి ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేష్ విగ్రహాలను ఫ్రీగా పంపిణీ చేస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గత కొంత కాలంగా పీవోపీ వినాయకుల సంఖ్య పెరగటంతో కాలుష్యం కూడా పెరిగిపోయింది. ప్రభుత్వం మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికి ఆకర్షణీయంగా వివిధ ఆకృతులలో ఉండే పీవోపీ గణేష్ విగ్రహాలనే లక్షలు ఖర్చు పెట్టి నవరాత్రి ఉత్సవాలలో ప్రతిష్టిస్తూ..వాటి నిమజ్జనంతో పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నారు. మట్టి విగ్రహాలు తక్కువ ధరకు..ఆకర్షణీయంగా రూపుదిద్దితే వాటి వాడకం పెరిగవచ్చు. అయితే ఈ దిశగా భక్తుల ఆలోచనతో పాటు మట్టి విగ్రహాల నిర్మాణంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉంది.