Hyd Metro: హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంపు?

  • By: sr    news    Mar 29, 2025 5:56 PM IST
Hyd Metro: హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంపు?

Hyd Metro |

విధాత: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ త్వరలో షాక్ ఇవ్వబోతుంది. నష్టాల్లో సాగిపోతున్న మెట్రో రైలు సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రయాణికులపై భారం వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 2017 లో ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు మెట్రో సంస్థ నష్టాలలోనే ఉందని, అందుకే నష్టాలనను తగ్గించుకునేందుకు చార్జీలు పెంచాలని భావిస్తుంది. అధికారిక సమాచారం మేరకు మెట్రో నష్టాలు రోజుకు కోటిన్న‌ర‌ దాటిన పరిస్థితుల్లో చార్జీల పెంపు తప్పదనే నిర్ణయానికి వచ్చారు. త్వరలో పెంచనున్న చార్జీలతో దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులపై భారం పడనుంది.

తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూర్ మెట్రో సంస్థ కూడా ఇటీవలే 44శాతం మేరకు ఛార్జీలు పెంచింది. 25 కి.మీ. దాటితే గరిష్టంగా 90 రూపాయల వరకు చార్జీలు పెంచారు. ఢిల్లీలో మెట్రో ఛార్జీలను 2017లో పెంచారు. హైదరాబాద్ మెట్రో కూడా చార్జీలు భారీగానే పెంచనున్నట్లు తెలుస్తోంది. కనీసం 30 శాతం పైనే ఈ సారి చార్జీలు పెంచనున్నట్లు సమాచారం.

ఖర్చులు అధికం.. ఆదాయం పరిమితం

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో చార్జీలు కనిష్టంగా 2 కిలోమీటర్లకు 10 రూపాయల నుంచి గరిష్టంగా 26 కిలోమీటర్ల కు రూ.60గా ఉన్నాయి. చార్జీలపై ఆధారపడకుండా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ.. ఆశించినంత ఆదాయం రావటం లేదు. మ‌ల్టీఫ్లెక్సులు, యాడ్స్ తో వచ్చే ఆదాయం కూడా అంతంతగానే ఉంది. వాహనాల పార్కింగ్ ఆదాయం కూడా నామమాత్రమే. దీంతో పెరుగుతున్న నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు. సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు చార్జిల పెంపు వంటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పదన్న నిర్ణయానికి మెట్రో సంస్థ వచ్చినట్లుగా సమాచారం.