Habits: ఈ 8 అలవాట్లు ఉంటే మీరే నంబర్1

  • By: sr    news    Mar 20, 2025 2:26 PM IST
Habits: ఈ 8 అలవాట్లు ఉంటే మీరే నంబర్1

Habits:

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం బిజీగా ఉండే జీవితాలు.కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కూడా పక్కన్న పెట్టి చేయాల్సిన పనులు. మారిన జీవన శైలితో లేనిపోని రోగాలన్ని మన శరీరాల్లో తిష్ట వేసుకుంటున్నాయి.అయితే నిత్యం మనం చేసే చిన్న చిన్న పనులే రోజూవారి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. జీవితంలో భారీ మార్పులకు దారితీసే అలవాట్ల గురించి నిపుణులు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ అలవాట్లు మీకు లేకపోతే వెంటనే అలవర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటిని అనుసరిస్తే ఎల్లప్పుడూ మీరే నంబర్ 1గా ఉంటారు. అవేంటంటే..

ఉదయాన్నే లేవడం..

పెద్దలకు ఉదయాన్నే మేల్కొనే అలవాటు ఉంటుంది. యువత చాలా వరకు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడానికి ఇష్టపడరు. ఉదయం 5 గంటలకే నిద్ర మేల్కోవడం ద్వారా ఎన్నో పనులను అనుకున్న సమయం కంటే ముందుగానే చేయవచ్చు. త్వరగా మేల్కుంటే స్వీయసంరక్షణ, ప్లానింగ్, ఒత్తిడి లేని ఉదయం మన సొంతమవుతుంది. ఈ అలవాటు అందరిలో మనల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది.మెదడు చురుగ్గా పని చేస్తుంది.

నీరు తాగడం..
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన వెంటనే శరీరాన్ని తగినంతగా నీరు ఇవ్వాలి. తద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా శక్తిని పెంపొందించడంలో నీరు కీలకం. ఈ అలవాటు ఆరోగ్యాన్ని అలాగే మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కృతజ్ఞత భావం తప్పనిసరి..

ఇతరులు చేసే మేలు మర్చిపోకుండా కృతజ్ఞత భావంతో ఉండాలి. సంక్లిష్ట పరిస్థితిలో సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది.

శారీరక శ్రమ తప్పనిసరి..

వ్యాయామం మానవ జీవితంలో ముఖ్యమైన అంశం. వ్యాయామం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బులు, మధుమేహం, అధిక బరువు తదితర సమస్యల బారిన పడకుండా చేస్తుంది. వ్యాయామాలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. రన్నింగ్, జాగింగ్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తినకముందు, తిన్న తరువాత అరగంట చొప్పున వాకింగ్ చేస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చదవడం ముఖ్యం..
పుస్తకాలు, పేపర్లు చదవడం గొప్ప వ్యక్తుల లక్షణాల్లో ఒకటి. చదవడం వల్ల జ్ఞాన సముపార్జణ జరుగుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇతర అంశాలపై దృష్టి మరలకుండా ఏకాగ్రత పెంపొందుతుంది. తెలియని విషయంపై స్పష్టంగా మాట్లాడగలరు.

బెడ్‌ను సర్దండి..

జీవితంలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణ అలవరుచుకోవాలి. ఉదయం లేవగానే మీ బెడ్‌ను(పరుపు) సర్దుకుంటే మనస్సు గందరగోళానికి గురి కాదు. మానసిక ప్రశాంతత కావాలంటే పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమనే విషయాన్ని మర్చిపోకూడదు.

పడుకునే ముందు ఫోన్ వద్దు..
క్షణం పాటు ఫోన్ లేకపోతే అల్లాడిపోయే రోజుల్లో ఉన్నాం. అయితే నిద్రకు ఉపక్రమించే 30 నిమిషాల ముందు వరకు ఫోన్‌కి దూరం ఉంచడం మంచిది. నిద్రించే ముప్పై నిమిషాల ముందు ఫోన్ స్క్రీన్ కళ్లపై పడకుండా చూసుకోవాలి. ఇది నిద్ర నాణ్యతను కాపాడుతుంది. లేకపోతే దీర్ఘకాలంలో కంటి సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. ఆ తరువాత ఆసుపత్రుల చుట్టూ తిరగడమే.

ధ్యానం ముఖ్యం..

నిత్యం ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. ప్రతి రోజూ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ధ్యానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం ఒత్తిడిని తగ్గించి.. ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా క్షణాల్లో పరిష్కారాన్ని వెతకగలిగే సామర్థ్యం మెరుగుపడుతుంది. తద్వారా సకాలంలో పనులు పూర్తవుతాయి.