Phone Taping: ముసుగులో తన్నులాట! ట్యాపింగ్‌ విచారణలో.. ఒకరిపై ఒకరు నెపాలు

  • By: sr    news    Jun 21, 2025 10:30 PM IST
Phone Taping: ముసుగులో తన్నులాట! ట్యాపింగ్‌ విచారణలో.. ఒకరిపై ఒకరు నెపాలు
  • అధికారుల చుట్టూనే తిరుగుతున్న వ్యవహారం
  • ఆదేశాలు ఇచ్చిన రాజకీయ నేత ఎవరు?
  • నోరు విప్పని ప్రభాకర్‌రావు అండ్‌ కో
  • తాజాగా మళ్లీ ప్రణీత్‌రావును విచారించిన సిట్‌
  • ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్‌ ఆధారంగా ప్రశ్నలు
  • స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసిన అధికారులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ ముసుగులో గుద్దులాటను తలపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికి చాలా మందిని సిట్‌ అధికారులు విచారించారు. అందరూ ఒకరిపై ఒకరు చెబుతున్నట్టు విచారణ తీరును గమనిస్తున్న అధికారులు గుర్తించారు. మొత్తంగా ఇప్పటి వరకూ అధికారుల చుట్టూనే.. అధికారుల మధ్యలోనే బంతి తిరుగుతూ ఉన్నది. అంతేకానీ.. అసలు ఇంతటి కీలక వ్యవహారానికి పై నుంచి ఆదేశాలు ఎవరు ఇచ్చారన్న సంగతిని మాత్రం ఏ ఒక్కరూ బయటపెట్టకపోవడం గమనార్హం.

విచారణకు ప్రణీత్‌రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు శనివారం సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రణీత్ రావు స్టేట్‌మెంట్‌ను సిట్ బృందం రికార్డు చేసింది. 2023 నవంబర్ 15న 650 ఫోన్ల ట్యాపింగ్‌పై మాజీ డీఎస్పీని సిట్ బృందం ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి ప్రణీత్ రావు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. 2023 నవంబర్ 15న ఒకే రోజు 650 ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని సిట్‌ గుర్తించింది. పలువురు మావోయిస్టు నాయకులతో వీరికి సంబంధాలు ఉన్నాయంటూ కొందరు రాజకీయ నేతల ఫోన్‌ నంబర్లను పంపించి, రివ్యూ కమిటీ ఆమోదం తర్వాత ఫోన్‌లు ట్యాప్‌ చేసినట్టు సిట్‌ అధికారులు చెబుతున్నారు.

ఈ అంశంలో ఇప్పటిక ప్రభాకర్‌రావును కూడా మూడు సార్లు విచారించారు. శనివారం ఇదే విషయంలో ప్రణీత్‌రావును మళ్లీ పిలిపించి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. వ్యక్తిగత బ్యాంకు లావాదేవీల వివరాలతో రావాలన్న సిట్‌ అధికారుల ఆదేశాలతో కొన్ని డ్యాక్యుమెంట్లను ప్రణీత్‌రావు తీసుకొని వచ్చారు. ప్రణీత్ రావు విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరి కొంతమందికి కూడా నోటీసులు పంపి, విచారణకు పిలుస్తారని తెలుస్తున్నది.