Trump | అటో ఇటో తేల్చేసుకోవాలి.. భారత్, పాక్‌కు ట్రంప్ సూచన

- కశ్మీర్ వివాదం వెయ్యేళ్లదని,టెన్షన్ 1500 ఏళ్లదని వ్యాఖ్య
ఆన్‌బోర్డ్ ఎయిర్‌ఫోర్స్ వన్: సమస్యలపై చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతారనే పేరున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తనదైన శైలిలో భారత్, పాకిస్థాన్ విభేదాల గురించి కూడా నోటికొచ్చింది వాగేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ కోసం ఇండియా, పాకిస్తాన్ వెయ్యేళ్లుగా కొట్టుకుంటున్నాయి… సరిహద్దుల్లో టెన్షన్లు పదిహేను వందల ఏళ్ల నుంచి ఉన్నవే.. ఇద్దరూ అటో ఇటో తేల్చేసుకోవాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోబోదన్న సారాన్ని భారత ప్రభుత్వ వర్గాలు అర్థం చేసుకుంటున్నాయి. 1947 నుంచి ఇండియా, పాకిస్తాన్ మధ్య కశ్మీర్ వివాదం అపరిష్కృతంగా ఉన్న సంగతి తెలిసిందే.
భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న అంశం గురించి వ్యాఖ్యానించాలని మీడియా కోర.. చాలా ఏళ్లుగా నలుగుతున్న ఈ వ్యవహారాన్ని రెండు దేశాలూ అటో ఇటో పరిష్కరించుకోవాలని అన్నారు. రెండు దేశాల అధినేతలతో మాట్లాడుతున్నారా? అన్న ప్రశ్నకు.. ‘నేను భారత్‌కు చాలా దగ్గరి మనిషిని. పాకిస్తాన్‌కు కూడా చాలా దగ్గరి మనిషిని అని మీకు తెలుసు. వాళ్లు కశ్మీర్‌పై వెయ్యేళ్లుగా కొట్లాడుకుంటున్నారు. వెయ్యేళ్లు అంతకంటే ఎక్కువ కాలం నుంచే ఇది నడుస్తున్నది. మొన్న జరిగింది విచారకరం. 30 మంది చనిపోయారు’ అని రోమ్ వెళ్లే సమయంలో తన ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘ఆ సరిహద్దులో పదిహేను వందల ఏళ్ల నుంచి టెన్షన్ ఉన్నది. అది మీకు కూడా తెలుసు.
అయితే.. ఈ విషయాన్ని వాళ్లు అటోఇటో తేల్చుకోవాలి. ఒకటి చెప్పగలను.. ఇద్దరు నేతలూ నాకు తెలుసు. పాకిస్తాన్, ఇండియా మధ్య తీవ్ర ఉద్రిక్తత ఉన్నది. అయితే.. అది ఎప్పుడూ ఉండేదే’ అని ట్రంప్ అన్నారు. 2019లో కశ్మీర్ విషయంలో ట్రంప్ చేసిన ప్రకటన.. ఒక్కసారిగా వివాదాన్ని రేపింది. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిగా వ్యవహరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తనను కోరినట్టు ఆ ప్రకటనలో ట్రంప్ వెల్లడించారు. ఆ ప్రకటన వెలువడిన గంట వ్యవధిలోనే భారత విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడి స్టేట్‌మెంట్‌ను తిరస్కరించారు. అలాంటి విజ్ఞప్తి ఏదీ మోదీ చేయలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈ విషయంలో మధ్యవర్తిత్వం విషయంలో మళ్లీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
ఇవి కూడా చదవండి..
Pahalgam Attack | పేలిన.. మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు
పహల్గామ్ దాడితో.. మాకు సంబంధం లేదు: TRF ! పాక్ ఆర్మీ చీఫ్ సూచనలతోనేనా?
Dal Lake Shikara | ఉగ్రవాదాన్ని ఎదిరించిన మహిళ.. దాల్ లేక్‌లో బోట్ షికార్!