Operation Sindoor | ఇండో పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు నిల్వల పరిస్థితేంటి? ఐవోసీ ఏం చెబుతున్నది?
భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం జనం ఎగబడుతున్నారు. దీనిపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎక్స్‌లో స్పందించింది.

Operation Sindoor | పహల్గామ్ దాడి, దానికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది యుద్ధానికి దారి తీస్తుందా? అనే అనుమానాలు ఉన్నాయి. సహజంగానే అటువంటి పరిస్థితి వస్తే నిత్యావసరాలపై కొంత మేరకు ప్రభావం ఉంటుంది. అందులోనూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటివి చాలా ముఖ్యమైనవి. దేశ సరిహద్దుల్లో అలజడి నెలకొన్న ఈ సమయంలో భారతదేశంలో తగినంత చమురు నిల్వలు ఉన్నాయా? అనే సందేహాలు వస్తాయి. ఎందుకంటే.. ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ లేనిదే ఈ ప్రపంచమే ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఈ అనుమానాలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ క్లారిటీ ఇచ్చింది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్, లేదా ఎల్పీజీకి ఎటువంటి కొరత లేదని, భారీగానే నిల్వలు ఉన్నాయని తెలిపింది. ప్రజలు కంగారుపడి, వాటిని ముందుగా నిల్వ చేసుకునేందుకు అవసరానికి మించి కొనుగోలు చేయాల్సిన పనిలేదని స్పష్టంచేసింది.
పెట్రోల్ బంకుల వద్ద, ప్రత్యేకించి సరిహద్దు రాష్ట్రాల్లో భారీ క్యూలైన్ల ఫొటోలు సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ వివరణ ఇచ్చింది. ‘దేశవ్యాప్తంగా తగింత స్టాక్‌ను ఇండియన్ ఆయిల్ కలిగి ఉన్నది. మా సరఫరాలు అన్నీ సజావుగా సాగిపోతున్నాయి. కంగారుపడి కొనాల్సిన అవసరం లేదు. మా అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం తగినంత ఉన్నది’ అని ఎక్స్‌లో ఇండియన్ ఆయిల్ తెలిపింది.
సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్, పంజాబ్ వంటి చోట్ల, మే 8, 9 తేదీల మధ్యరాత్రి పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్ దాడులకు పయత్నించడంతో బ్లాక్‌ఔట్ విధించిన ప్రాంతాల్లో ప్రజలు కంగారుపడి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ డ్రోన్ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నట్టు ఆర్మీ ప్రకటించింది. అయితే.. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందనే అనుమానంతో ప్రజలు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొనుగోలుకు లైన్ కట్టారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌లో స్పందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ‘ప్రశాంతంగా ఉండి, అనవసరపు రద్దీని నివారించడం ద్వారా.. మీకు సేవ చేసేందుకు మాకు సహకరించండి. తద్వారానే మా సరఫరా లైన్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తాయి. మనందరికీ ఎక్కడా ఎలాంటి అవరోధాలు లేకుండా చమురు అందుతుంది’ అని తెలిపింది. కంగారు పడి కొనుగోలు చేయడం వల్ల పెట్రోల్ బంకుల్లో అవాంఛనీయమైన రద్దీ ఏర్పడుతున్నదని పేర్కొన్నది.