Budapest | పానీపూరీనా మజాకా..! బుడాపెస్ట్ యూనివర్సిటీ విద్యార్థుల మనసు దోచిందిగా!

ఇండియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్‌లో పానీపూరీ ఒకటి. ఒకపక్కన పానీపూరీ ప్లేట్ట్‌లో ఒకటి తర్వాత ఒకటి పడుతూ ఉంటే.. వాటిని గుటుక్కుమనిపిస్తూ ఉంటే కారం కారంగా.. పుల్లపుల్లగా.. ఆ మజానే వేరు! కొంతమందికి సాయంత్రం అయిందంటే చాలు.. కనీసం ఒక్క ప్లేట్ అయినా పానీపూరీ తినడం అలవాటు. ఇంతటి ఫేమస్ ఫుడ్ యూరప్‌లోని హంగరీలో ఉన్న బుడాడాపెస్ట్ యూనివర్సిటీ విద్యార్థుల మనసు చూరగొంటున్నది. భారతీయ విద్యార్థి తుషార్ కుమార్ జైన్.. ఈ పానీపూరీని తన తోటి విద్యార్థులకు పరిచయం చేశాడు. ఆ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ చదువుతున్న తుషార్.. ఇంటర్నేషనల్ డే సెలబ్రేషన్ సందర్భంగా భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ ఫుడ్‌ను పరిచయం చేయాలని భావించాడు. దాని గురించి ఆలోచించగానే తళుక్కున మైండ్‌లో పానీపూరీ మెదిలింది.
అంతే.. వెంటనే ఆచరణలో పెట్టేశాడు. క్యాంపస్‌లో ఇండియన్ స్టాల్ ఏర్పాటు చేసి.. అందులో పానీ పూరీని తోటి విద్యార్థులకు అందించాడు. ఇక వివిధ దేశాల విద్యార్థులు.. సూపర్బ్ అంటూ లాగించేశారు. ఈ మేరకు ఒక రీల్.. బత్తమీజ్ దిల్ పాటతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఒక విదేశీ విద్యార్థిని ఒక చేతిలో చాక్లెట్ కేక్.. మరో చేతిలో పానీపూరీ ప్లేట్ బ్యాలెన్స్ చేస్తూ పానీపూరీ తింటుండటంతో వీడియో స్టార్ట్ అవుతుంది. మరికొందరు విద్యార్థులతోపాటు.. ఫ్యాకల్టీగా కనిపిస్తున్న ఒక మహిళ సైతం పానీపూరీని ఆరగించారు. వాళ్లందరూ మెడికల్ విద్యార్థులే. దీంతో తుషార్ జైన్ ఒక సరదా ప్రయోగం కూడా చేశాడు. పూరీలోకి పానీని ఒక సిరంజిని ఉపయోగించి ఎక్కించాడు.