Bhumi Sunil: రైతుకు.. చట్టాలు చుట్టాలు కావాలి! అన్నదాతలతో భూమి సునీల్

- లీఫ్స్ ‘సాగు’ న్యాయ యాత్ర
- చట్టాలపై రైతులకు అవగాహన
- కరపత్రం, పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, (విధాత) : తెలంగాణ రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించడం, వారి న్యాయ అవసరాలను అధ్యయనం చేయడం లక్ష్యంగా లీఫ్స్ సంస్థ చేపట్టిన ‘రైతు న్యాయ యాత్ర’ శనివారం భూదాన్ పోచంపల్లిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో రైతులతో భూమి సునీల్ సమావేశమై వ్యవసాయ, మార్కెట్ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చట్టాల్లోని ముఖ్యాంశాలను రైతులకు వివరించి, మార్కెట్లలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూమి హక్కుల ప్రాధాన్యం, పంటల బీమా, రుణాల సౌకర్యం, సేంద్రియ వ్యవసాయం, సమగ్ర పంటల మాదిరి వ్యవసాయం, ప్రభుత్వం అందించే రాయితీలు, సబ్సిడీల గురించి రైతులకు వివరించారు. చట్టాలు రైతులకు చుట్టాలు కావాలనే ఆశయంతో తాము ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు సునీల్ తెలిపారు.
ప్రస్తుతం విత్తన చట్టం రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ చట్టం అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. భూదాన్ చరిత్ర, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను భూదాన్ యజ్ఞ బోర్డ్ చైర్మన్ రాజేందర్ రెడ్డి సాగు న్యాయ యాత్ర పూర్తి అయ్యే వరకు లీఫ్స్ సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పంట నష్టం పోతే , సబ్సిడీలు ఎలా తెచ్చుకోవాలో తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన పథకాలు, కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం, రాబోయే రోజుల్లో తీసుకురానున్న విత్తన చట్టం గురించి వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి వివరించారు. రైతులు పంట అమ్మే టప్పుడు దళారి చేతులలో మోసపోవద్దని సూచించారు.
నకలీ విత్తనాలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చే రాయితీలు, సబ్సిడీల మరియు రాబోయే రోజులలో వచ్చే పథకాల గురించి వివరించారు. అంతకు ముందు భూదాన్ పోచంపల్లిలోని జువ్వి చెట్టు కింద కరపత్రం, పోస్టర్‌ను భూమి సునీల్ తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లీఫ్స్ ఉప అధ్యక్షుడు జీవన్ రెడ్డి, లీఫ్స్ జాయింట్ సెక్రటరీ అభిలాష్, లీఫ్స్ కోశాధికారి మల్లేశ్, సభ్యులు ప్రవీణ్, రవి, పోచంపల్లి గ్రామ రైతులు, మండల వ్యవసాయ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటి రోజు భూదాన్ పోచంపల్లితోపాటు.. పుట్టపాక, మునుగోడు, చండూరు, నాంపల్లి, సంస్థాన్ నారాయణపురం, మల్లేపల్లి గ్రామాల్లో సాగు న్యాయ యాత్ర కొనసాగింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఈ యాత్ర కొనసాగనుందని లీఫ్స్ సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Bhu Barathi: భూభారతి చట్టంపై ఖుల్లం ఖుల్లా.. భూమి చట్టాల నిపుణుడు భూమి సునీల్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
భూమి చట్టాల్లో 2 దశాబ్దాల అనుభవశాలి.. భూమి సునీల్