Telangana: ‘LRS’ గడువు మరో నెల పొడిగింపు! కానీ

  • By: sr    news    Apr 01, 2025 11:38 AM IST
Telangana: ‘LRS’ గడువు మరో నెల పొడిగింపు! కానీ

Telangana:

విధాత : లేఅవుట్ల క్రమబద్ధీకరణ(LRS)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(OTS) పథకాన్ని (ఓటీఎస్‌) మరో నెల రోజులు పొడిగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సోమవారం (మార్చి 31) ఈ పథకం గడువు ముగిసిన నేపథ్యంలో మరో నెలరోజులు కొనసాగించాలని నిర్ణయించినా.. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, గడువు పొడిగించినా.. రాయితీ మొత్తంపై కొన్ని పరిమితులు విధించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మొత్తం చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తుండగా.. ఇకపై మొదటి 15 రోజులు అంటే ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకూ ఈ రాయితీని 15 శాతానికి తగ్గిస్తారు. తర్వాతి 15 రోజుల్లో రాయితీని పూర్తిగా ఎత్తివేయనున్నారు. అంటే మొత్తం ఫీజు చెల్లించాలన్నమాట.

రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఓటీఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020లో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ఆధారంగా చేసుకున్న దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకూ దాదాపు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకూ ఫీజు చెల్లించారు. ఇదిలాఉంటే పథకం అమల్లోకి వ‌చ్చిన అనంత‌రం కొద్దిపాటి సాంకేతిక సమస్యలు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. అధికారులు వాటిని గుర్తించి పరిష్కరించేలోపు గడువు తేదీ సమీపించింది. ఆపై వ‌రుస‌బెట్టి వ‌చ్చిన‌ పండుగ‌ల కారణంగా చివరి రెండు రోజుల్లో కార్యకలాపాలు మందగించాయి. ఈ నేపథ్యంలోనే గడువు పొడిగించాలని ప్ర‌జ‌ల నుంచి భారీగా వినతులు వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఓటీఎస్‌ను మరో నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.