• Telugu News
  • /News

Donuru Ananya | అనన్య రెడ్డి అసాధారణ ప్రతిభ.. కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌లో సత్తా..!

Donuru Ananya | సివిల్స్‌ ఫలితాల్లో పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డి సత్తాచాటారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, కోచింగ్‌ తీసుకోకుండానే, తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో సత్తా చాటారు. దాంతో ఆమె కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Reported by: Thyagi | వార్త‌లు | Apr 17, 2024, 7:31 pm IST
Read Time: 4 mins
Donuru Ananya | అనన్య రెడ్డి అసాధారణ ప్రతిభ.. కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌లో సత్తా..!

Donuru Ananya : సివిల్స్‌ ఫలితాల్లో పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డి సత్తాచాటారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, కోచింగ్‌ తీసుకోకుండానే, తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో సత్తా చాటారు. దాంతో ఆమె కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అనన్యరెడ్డికి చిన్నప్పటి నుంచే ఐఏఎస్‌ కావాలనే ఆశయం ఉంది. ఆమె బాల్యమంతా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోనే గడిచింది. అనన్య ఐఏఎస్‌ కావాలన్న కలలకు స్ఫూర్తినిచ్చింది ఆమె తాత కృష్ణారెడ్డి. ఆయన సలహాలు, సూచనలతో చిన్నప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా అనన్య చదువుకుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

అనన్య ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని గీతం పాఠశాలలో చదివారు. ఎస్సెస్సీలో మంచి గ్రేడింగ్‌తో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ప్రారంభం నుంచి ఐఏఎస్‌ వైపు అడుగులు పడ్డాయి. దాంతో ఆమెను హైదరాబాద్‌లోని నారాయణ ఐఏఎస్‌ అకాడమీలో చేర్చారు. ఇంటర్‌ పూర్తయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్‌ కళాశాలలో బీఏ చదివారు.

డిగ్రీ పూర్తయ్యాక 2020 నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్‌ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సివిల్స్‌లో ఆప్షనల్‌ సబ్జెక్టులుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఈ ఒక్క ఆంత్రపాలజీ కోసం ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నారు. మిగతా సబ్జెక్టులు అన్ని కూడా సొంతంగా ప్రిపేరయ్యారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటలు చదివినట్లు అనన్య చెప్పారు.

అనన్య రెడ్డికి చదివిన ప్రతి అంశాన్ని నోట్‌గా రాసుకునే అలవాటు ఉండటంతో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా సులువుగా లక్ష్యాన్ని చేరుకుని ప్రణాళిక ప్రకారం నిర్దేశిత సమయంలో సిలబస్‌ను పూర్తిచేసే విధంగా ప్రిపరేషన్‌ కొనసాగించారు. సివిల్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో సీనియర్ల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడినట్లు అనన్యరెడ్డి చెప్పారు.