మధ్య భారత ‘యుద్ధం’ శాంతించేనా?

  • By: sr    news    Apr 13, 2025 2:04 PM IST
మధ్య భారత ‘యుద్ధం’ శాంతించేనా?
  • మోడీ,అమిత్‌షాకు శాంతి చర్చల కమిటీ లేఖ
  • ఇరువైపులా కాల్పుల విరమణ లక్ష్యం
  • చర్చల ద్వారా పరిష్కారానికి ప్రయత్నం
  • భిన్నవర్గాల ప్రాతినిధ్యంతో శాంతి కమిటీ

విధాత ప్రత్యేక ప్రతినిధి: మధ్య భారతంలో మావోయిస్టులే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సాయుధ బలగాలతో వరుస దాడులు చేస్తూ మావోయిస్టులను హత మారుస్తున్న విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఛత్తీస్‌గఢ్‌‌తో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల పరిధిలోని మావోయిస్టులపై భద్రతా బలగాలు బాంబుల దాడులు, తుపాకుల కాల్పుల మోత మోగిస్తున్నాయి. ఈ దాడులలో ఇప్పటివరకు వందల సంఖ్యలో మావోయిస్టులతో పాటు ఆదివాసీలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. మావోయిస్టులకు కీలక కేంద్రంగా భావిస్తున్న అబూజ్ మాడ్ అడవులలో కూడా భద్రత బలగాలు అడుగడుగున మోహరించి వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పలు సందర్భాలలో ఈ విషయం ప్రకటించారు.భద్రత బలగాలు, మావోయిస్టుల యుద్ధం వల్ల మధ్య భారతం రక్త మోడుతోంది. ఈ మారణహోమానికి చరమగీతం పాడి ఇరువర్గాల మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు రాష్ట్రంలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటు అయింది.

ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య చర్చలు జరగాలని బలమైన ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఇరువర్గాలు కాల్పుల విరమణ పాటించి చర్చలకు అవసరమైన ముందస్తు వాతావరణం సృష్టించాలని భావిస్తోంది. ఈ శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనకు సానుకూలంగా ఈ నెల 3న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) అధికార ప్రతినిధి అభయ్ చర్చలకు తాము సిద్ధమంటూ అనుకూల ప్రకటన చేశారు. మరోవైపు చతిస్గడ్ ఉప ముఖ్యమంత్రి చర్చల అంశాన్ని తెరపైకి తేవడంతో ప్రస్తుతం ఈ అంశానికి ప్రాధాన్యత చేకూరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా సమాజంలోని భిన్న వర్గాల ప్రాతినిధ్యంతో ఏర్పాటైన శాంతి చర్చల కమిటీ శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీకి, హోం శాఖ మంత్రి అమిత్ షాకు దేశంలోని ఎంపీలకు ఓ లేఖను రాసింది. ఈ లేఖపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రతిస్పందిస్తుందని చర్చ ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ, ఈ ప్రయత్నం పట్ల భిన్న వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. శాంతి చర్చల కమిటీ రాసిన ఆ లేఖ వివరాలు ఇలా ఉన్నాయి.

మోడీ, అమిత్ షాలకు శాంతి చర్చల కమిటీ లేఖ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి

విషయం: కేంద్ర ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ అఫ్ ఇండియా – మావోయిస్టు పార్టి [CPI -Maoist Party] మధ్యన కాల్పుల విరమణ – శాంతి చర్చల కోసం మీ యొక్క జోక్యం ఆవశ్యకత గురించి!

మేము పీప్ డైలాగ్ కమిటీ బాధ్యులము. ఈ కమిటీ పౌర సమాజము నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నది. సిపిఐ – (మావోయిస్టు) పార్టీ, కేంద్ర ప్రభుత్వము మధ్యన కాల్పుల విరమణ – శాంతి చర్చల స్థాపన కోసం ఏర్పాటు అయ్యింది. ఇరు పక్షాల మధ్య శాంతియుత చర్చలను సులభతరం చేయడంకోసం, కాల్పుల విరమణను ప్రోత్సహించడం, మరియు హింసను అంతం చేయడానికి స్థిరమైన పరిష్కారాలను కనుగొనడం, ఇరు పక్షాలకు సూచనలు చేయటం కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కమిటీలో సమాజంలోని వివిధ వర్గాల నుండి న్యాయ కోవిదులు ప్రొఫెసర్లు, డాక్టర్లు, మానవ హక్కుల నిపుణులు, జర్నలిస్టులు, ప్రజా నాయకులు భాగస్వాములుగా ఉన్నారు. మధ్య భారత దేశములో మావోయిస్టు పార్టీ సాయుధులకు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధులకు మధ్య జరుగుతున్న హింసా విధానాలకు సామాన్య ప్రజలు, ఆదివాసీలు తమయొక్క.జీవించే హక్కును కోల్పోతున్నారు. నిత్యము ఆయా ప్రాంతాలలో నెత్తుటి మధ్యలోనే ప్రజలు జీవిస్తున్నారని పత్రికలలో వస్తున్న వార్తల ద్వారా మేము కలవరపడుతున్నాము. ఇద్దరి హింసా విధానాల ఫలితముగా మహిళలు, పిల్లలు, యువత భయబ్రాంతులకు గురౌతున్నారు మరియు గ్రామాలు, గూడేలు వదిలి తరలి వెళుతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాలు, రాజ్యంగములో చెప్పిన విధముగా సంక్షేమ రాజ్యము ఏర్పాటు చేయుటకు సరియైన, తగినటువంటి వాతావరణం దిన దినము సమాజములో
క్షీణించుక పోతున్నదని తెలిసి మేము ఆందోళన చెందుతున్నాము. మావోయిస్టు పార్టీ గెరిల్లాలు మరియు ప్రభుత్వ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణను నివారించడానికి కాల్పుల విరమణ – శాంతి చర్చలు ఒక్కటే మార్గం అని ప్రజాస్వామిక వాదులముగా మేము భావిస్తున్నాము.

ఇరు పక్షాల మధ్య జరుగుతున్న ఈ సాయుధ సంఘర్షణ దేశంలోని అనేక ప్రాంతాలలో అశాంతి, మరియు ప్రాణనష్టానికి కారణమవుతోంది. మహిళలు మానభంగాలకు గురౌతున్నారు. చిన్నపిల్లలు తల్లి తండ్రులను కోల్పోతున్నారు, గిరిజన సముదాయాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పెద్దఎత్తున మానవ హక్కులకు విఘాతము కలుగుతున్నది, ఈ హింసా విధానాలు సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తూ, అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నది. ఈ పరిస్థితుల దృష్ట్యా మరియు భారత రాజ్యాంగం కల్పిస్తున్న సంక్షేమ రాజ్య స్థాపన కోసం మీరు వెంటనే జోక్యం చేసుకోవాలనియు, దేశంలో రగులుతున్న హింసను, వాటి పరిణామాలను, పరిస్థితులను చక్కపెట్టాలని కోరుతున్నాము. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు పూనుకునే విధముగానూ, ఇరు పక్షాలు శాంతి చర్చల వైపు ప్రయాణం చేసేవిధముగా తగిన వాతావరణాన్ని కల్పించుటకోసం, ఈ దేశ
భవిష్యత్తు కోసం మీ జోక్యం తక్షణావసరం ఉన్నదని మీరు భావించాలని పీస్ డైలాగ్ కమిటీ విన్నవిస్తున్నది. సానుకూలముగా మీరు స్పందిస్తారని ఆశిస్తూ…
ధన్యవాదములతో,

పీస్ డైలాగ్ కమిటీ ప్రతినిధులు

1. జస్టిస్ చంద్రకుమార్ (ఫార్మర్)- చైర్మన్
2. జంపన్న అలియాస్ జినుగు నరసింహారెడ్డి , వైస్ చైర్మన్
3. ప్రొఫెసర్ హరగోపాల్ వైస్ చైర్మన్
4. దుర్గాప్రసాద్ కన్వీనర్
5. జయ వింధ్యాల కో కన్వీనర్
6. డాక్టర్ తిరుపతయ్య కో కన్వీనర్
7. సిహెచ్ బాలకిషన్ రావు కోకన్వీనర్
8. కందుల ప్రతాప్ రెడ్డి కో కన్వీనర్