Waqf Law | వక్ఫ్ బోర్డును పరిరక్షించాలి.. బీజేపీ విధానాలను తిప్పికొట్టాలి : అసదుద్దీన్ ఒవైసీ

  • By: TAAZ    news    May 18, 2025 9:24 PM IST
Waqf Law | వక్ఫ్ బోర్డును పరిరక్షించాలి.. బీజేపీ విధానాలను తిప్పికొట్టాలి : అసదుద్దీన్ ఒవైసీ

వరంగల్ ప్రతినిధి, మే 18, విధాత:

Waqf Law | కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ బోర్డు ను రక్షించాలని అల్ ఇండియా ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌ చేశారు. సేవ్ వక్ఫ్‌ ..సేవ్ కాన్‌స్టిట్యూషన్‌ అనే నినాదంతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎండి అతీక్ రహమాన్ అధ్యక్షతన ఇస్లామియా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మైనార్టీలకు అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా మైనార్టీలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

ఇక్కడ ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు భాయీ భాయీ అంటూ ఉన్నారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం లౌకిక విధానంతో ముందుకు వెళుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్‌ భావజాలంతో వెళుతూ అనేక సంస్థలను రద్దు చేస్తున్నదని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను అన్యాయంగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటున్నారని విమర్శించారు.  భారత దేశాన్ని హిందూ దేశంగా చేసేందుకు కేంద్రం చేస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా లౌకికవాద పార్టీలు కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు మాజీ ఎంపీ అజీజ్ పాషా, అజీజ్ ఖాన్, డాక్టర్ అనీస్ సిద్ధికి, సయ్యద్ సుభాన్, ముత్తూరు కృష్ణ, కార్పొరేటర్లు, మత పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.