మా సీఎం ఫామ్ హౌజ్‌లో పడుకోలేదు: మంత్రి సీతక్క
మా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లో పడుకోలేదు ప్రజలకు దూరంగా లేరు నిత్యము ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.

- విమర్శలు మానీ సూచనలు ఇవ్వండి
- మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
- వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, ఆగస్ట్ 27(విధాత): మా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లో పడుకోలేదు, ప్రజలకు దూరంగా లేరు నిత్యము ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారన్నారు. నేను కూడా నిజాంబాద్, కామారెడ్డి జిల్లాలా యంత్రాంగంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించానని మంత్రి వెల్లడించారు. కామారెడ్డి లో గోడ కులి ఇద్దరు మరణించినట్టుగా సమాచారం ఉంది. ఆ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీతక్క సూచించారు.
అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ ప్రజల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, వాతావరణము సహకరించడం లేదు కాబట్టి ప్రజలకి ఇబ్బంది అవుతుందన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ బీహార్ లో ఓట్ అధికార యాత్ర చేపట్టారు, ఆయనకు మద్దతుగా పోరాటానికి మద్దతుగా మేము వెళ్ళామన్నారు. జాతీయ పార్టీ కాకున్నా కేసీఆర్ దేశంలో హెలికాప్టర్ తీసుకొని తిరిగిండ్రు, రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మేము వెళితే తప్పేంటని మంత్రి సీతక్క ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ విమర్శలు మానుకొని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌కు లింకులు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నారన్నారు.