CM Revanth Reddy | మిస్ వరల్డ్ పోటీలు.. బ్యూటిఫికేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలి

విధాత: మిస్ వరల్డ్-2025 పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిఅధికారులను ఆదేశించారు.హైదరాబాద్ నగరంలో మే 10 నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాల గురించి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకొని పలు సూచనలు చేశారు. విమానాశ్రయం, అతిథులు బస చేసే హోటల్స్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అతిధులు తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని, నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీలు పూర్తయ్యే వరకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.