ఊర్కొండ పేట గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు.. నిందితుల రిమాండ్!

నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఏడుగురిని రిమాండ్‌కు తరలించారు. కల్వకుర్తి సీఐ నాగార్జున, ఊర్కొండ ఎస్సై కృష్ణదేవ తెలిపిన వివరాల మేరకు “గత శనివారం రాత్రి దాదాపు 10.30 గంటలకు ఓ జంట ద్విచక్ర వాహనంపై దేవాలయానికి రాత్రి నిద్ర చేసేందుకు రావడాన్ని నిందితుల్లో నలుగురు గమనించారు. అర్థరాత్రి వేళ అక్కడి బాత్రూంలు లాక్ చేసి ఉండటంతో… కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆలయ సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి బాధితురాలు వెళ్లింది. ఆమెకు తోడుగా వెంట వచ్చిన బంధువు కూడా వెళ్లాడు. ఆ జంట కొంత అనుమానాస్పదంగా ఉండటంతో ఆ నలుగురు వారిని గమనిస్తూ తమ స్నేహితులైన మరో ముగ్గురిని పిలిపించారు.
వారు భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళతో పాటు వచ్చిన వ్యక్తిని కట్టేసి ఆమెపై సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా మద్యం సేవిస్తూ రాత్రి 12 గంటల ప్రాంతం నుంచి.. తెల్లవారుజామున 3 గంటల వరకు ఒకరి వెంట ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు దాహంగా ఉందని నీళ్లు కావాలని అడిగితే నోట్లో మూత్రం పోసి అమానుషంగా వ్యవహరించారు. అనంతరం బాధితురాలి పుస్తెలతాడు, చెవి కమ్మలు లాక్కున్నారు. తెల్లవారు జాము సమయంలో నిందితులు వెళ్లిపోయాక బాధితురాలు తేరుకుని, ఆమెతో వచ్చిన వ్యక్తి కట్లు విప్పింది. ఆ వ్యక్తితో కలిసి ఆదివారం ఉదయం దేవాలయం ముందు నుంచి భూత్పూర్ మండలంలోని తమ సొంత గ్రామానికి వెళ్తుండగా.. నిందితుల్లో ఒకరైన మహేశ్ గౌడ్ గమనించాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే మీ వ్యవహారం బయట పెడతామని బెదిరించాడు.
బాధితురాలు భయంతో ఈ విషయాన్ని చెప్పకుండా.. గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి బంగారు ఆభరణాలు, డబ్బు చోరీ చేశారని ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఆలయానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆలయ ఒప్పంద కార్మికుడు మహేశ్ గౌడ్ బాధితురాలిని బెదిరించడాన్ని గుర్తించారు. అప్రమత్తమైన ఎస్సై కృష్ణదేవ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి మహేశ్ గౌడ్ ను విచారించారు. ఊర్కొండపేటకు చెందిన సాధికాబాబా, హరీశ్ గౌడ్, మణికంఠగౌడ్, మారుపాకుల ఆంజనేయులుగౌడ్, మట్ట ఆంజనేయులుగౌడ్, కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కార్తిక్ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది” అని వారు వివరించారు. నిందితులు గతంలో ఆలయానికి వచ్చే ప్రేమికులు, మైనర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తేలిందన్నారు. ఒంటరి మహిళలపై అత్యాచారాలకు కూడా పాల్పడినట్లుగా వెల్లడైందని తెలిపారు. విచారణలో అన్ని విషయాలు రాబడుతామని, సాక్ష్యాలను ఫాస్టాక్ కోర్టుకు, హైకోర్టుకు సమర్పించి ఈ కేసులోని నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
నిర్మానుష్య ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగే జంటలే ఆ గ్యాంగ్ లక్ష్యం. మహిళలు, వివాహితలు ఇతరులతో చిక్కితే.. పోలీసులకు చెప్తామంటూ బెదిరిస్తారు. బ్లాక్ మెయిల్ చేసి కావాల్సింది దక్కించుకుంటారు. చిక్కిన వాళ్లు మైనర్లైతే డబ్బులు లాక్కొని వదిలేస్తారు. ఎందుకంటే పట్టుబడితే పోక్సో కేసులు నమోదవుతాయని వారికి తెలుసు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో.. మహిళ అత్యాచార ఘటనలో అరెస్టైన ఏడుగురు నిందితులు… నేరాలకు పాల్పడే తీరిది. ప్రస్తుతం పోలీసులకు చిక్కిన ఏడుగురుతో పాటు.. మరో ముగ్గురు, నలుగురు గతంలో ఇదే తరహా ఘటనలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ఆధారాలతో నిందితులకు కఠిన శిక్ష పడేలా సమాయత్తమవుతున్నారు.