Telangana | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు.. ‘శాశ్వ‌త’ సెగ‌

  • By: sr    news    May 02, 2025 7:13 AM IST
Telangana | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు.. ‘శాశ్వ‌త’ సెగ‌
  • శాశ్వ‌త ఉద్యోగుల రాక‌ పేరుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌పై అకార‌ణ‌ వేటు
  • అదేమంటే ఆర్థిక లోటు అంటూ దాట‌వేత‌
  • సాక్షాత్తు స‌చివాల‌యంలోనే తొల‌గింపులు

హైద‌రాబాద్‌, మే 1 (విధాత‌): తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ కొలువుదీరిన త‌రువాత ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు న‌గ‌రంలో భారీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర‌ మంత్రుల‌ను ఆహ్వానించి, స‌న్మానం చేసి త‌మ డిమాండ్ల‌ను వారి ముందు పెట్టారు. ఉన్న వారిని కొన‌సాగిస్తామ‌ని, మీ న్యాయ‌మైన డిమాండ్ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఒక‌ కార్య‌క్రమంలో మాట్లాడుతూ, ప‌ర్మినెంట్ చేయ‌డం కుద‌రంటూనే ఉన్న‌వారి పొట్ట‌కొట్ట‌మ‌ని ప‌రోక్షంగా చెప్పారు. ఇందుకు పూర్తి భిన్నంగా స‌చివాల‌యంలోని ఉన్న‌ధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సుమారు 200 నుంచి 300 మంది వ‌ర‌కు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు తొల‌గించేందుకు శ్రీకారం చుట్టారు.

తెలంగాణ డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ప్ర‌భుత్వ శాశ్వ‌త ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు ద‌శాబ్ధ కాలానికి త‌క్కువ కాకుండా రెండు ద‌శాబ్ధాల నుంచి వివిధ విభాగాల‌లో చిన్న చిన్న ఉద్యోగాల‌లో ప‌నిచేస్తున్నారు. కొంద‌రు ఆఫీసు బాయ్‌లుగా మ‌రికొంద‌రు డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లుగా, డ్రైవర్లుగా, ఆఫీసు అసిస్టెంట్లుగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. చాలీచాల‌నీ జీతాల‌తో నెట్టుకు వ‌స్తున్నారు. కొంద‌రికి రూ.15వేలు మ‌రికొంద‌రికి రూ.16 వేల వ‌ర‌కు ప్ర‌తినెలా చెల్లిస్తున్నారు. ఈ రోజు కాక‌పోయినా రేపు అయినా త‌మ ఉద్యోగాల‌కు భ‌ద్ర‌త ల‌భిస్తుంద‌నే గంపెడాశ‌తో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాత వీరి జీవితాల్లో క‌ల్లోలం మొద‌లైంది.

ఇప్ప‌టికే కొన్ని సెక్ష‌న్ల‌లో తొల‌గింపుల ప‌ర్వం మొద‌లైంది. త‌మ‌ను అకార‌ణంగా తొల‌గిస్తున్నారంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పై స్థాయి అధికారుల ముందు గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. ఉన్న‌ఫ‌ళంగా తొల‌గిస్తే ఎక్క‌డ‌కు వెళ్లాల‌ని, ఈ వ‌య‌స్సుల‌తో త‌మ‌కు బ‌యట ఉద్యోగాలు ఎవ‌రిస్తారు అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నా ఏ అధికారి కూడా కిమ్మ‌న‌డం లేదు. ఏ రోజున‌ రావొద్దు అని చెబుతారోన‌ని బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. కొద్ది నెల‌ల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి సుమారు 147 మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు వ‌చ్చారు. వీరంతా తెలంగాణ స్థానిక‌త ఉన్న‌వారే.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వీరు స‌చివాల‌యంలో విధులు నిర్వ‌ర్తించారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత వీరిని ఏపీకి కేటాయించి పంపించారు. ప‌లు విజ్ఞ‌ప్తులు, పైర‌వీల త‌రువాత 147 మంది ఉద్యోగుల‌ను ఏపీ నుంచి తెలంగాణ‌కు శాశ్వ‌తంగా బ‌దిలీ చేశారు. స్థాయిని బ‌ట్టి తొలుత హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ల‌లో స‌ర్థుబాటు చేశారు. వీరిలో ఎక్కువ‌గా అటెండ‌ర్లు, రికార్డు అసిస్టెంట్లు, పేషీల‌లో ప‌నిచేసే వారే ఉన్నారు. ఆ త‌రువాత వీళ్లంద‌రినీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ నుంచి స‌చివాల‌యానికి బ‌దిలీ చేశారు. వీళ్ల రాక‌తో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భ‌విష్య‌త్తు అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది.

ఇదే అద‌నుగా ఉన్న‌తాధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొల‌గింపున‌కు శ్రీకారం చుట్టారు. సాధార‌ణంగా ప్ర‌తి 12 నెల‌ల‌కు ఒక‌సారి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీల కాంట్రాక్టును మ‌రో ఏడాది పాటు కొన‌సాగిస్తూ (రెన్యూవ‌ల్‌) ఉత్త‌ర్వులు జారీ చేస్తారు. గ‌త నెల నుంచి ఈ ప్ర‌క్రియ‌ను నిలిపివేయ‌డంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌లో ద‌డ మొద‌లైంది. త‌మ ప‌రిస్థితి ఏంట‌నీ అడిగితే, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగా లేద‌ని, అందుకే తొల‌గిస్తున్నామ‌ని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. స‌చివాల‌యంలో వంద‌ల కొద్ది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని, అయినా త‌మ‌ను తీసేయ‌డం అన్యాయ‌మ‌ని మొత్తుకున్నా వినిపించుకోవ‌డం లేదంటున్నారు.

ఏపీ నుంచి వ‌చ్చిన ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను స‌ర్ధుబాటు చేయ‌డాన్ని తాము వ్య‌తిరేకించ‌డం లేద‌ని, త‌మ‌ను బ‌జారున ప‌డేయ‌వ‌ద్ద‌ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఏపీ ఉద్యోగుల‌ను బూచీగా చూపించి త‌మ‌ను తొల‌గించ‌డంలో ఒక ఉన్న‌తాధికారి అత్యుత్సాహం చూపిస్తున్నార‌ని మండి ప‌డుతున్నారు. ఆయ‌న అంత‌గా ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో త‌మ‌కు న్యాయం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రుల‌ను స‌చివాల‌య ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేడుకుంటున్నారు.