విధాత: నా కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న సింగపూర్ స్కూల్ లో అగ్ని ప్రమాదం జరుగడం ఆందోళన కల్గించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మార్క్ శంకర్ వద్ధకు తన అన్నావదినలు చిరంజీవి దంపతులను పంపిస్తున్నట్లుగా తెలిపారు.
తన పెద్దకొడుకు అకీరానందన్ పుట్టిన రోజునే చిన్న కుమారుడికి అగ్ని ప్రమాదం జరుగడం బాధాకరమన్నారు. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ప్రమాదం జరిగిందని.. తాను ఉదయం అరకు పర్యటనలో ఉన్నప్పుడు ప్రమాదంకు సంబంధించి ఫోన్ వచ్చిందని తెలిపారు. ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని, బ్రాంకో స్కోప్ చేస్తున్నారని వెల్లడించారు.
ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అనారోగ్యానికి గురయ్యాడన్నారు. ప్రమాదంలో ఓ పసిబిడ్డ చనిపోయిందని.. మరో 15మందికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాద తీవ్రత ఉదయం తెలియలేదన్నారు. ప్రధాని మోదీ సహా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్ , కేంద్ర, రాష్ట్రాల మంత్రులు పలువురు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారని వారందరికి నా ధన్యవాదాలన్నారు.