Anti-Narcotics Bureau | ప్రొటెక్ట్, ఎడ్యుకేట్, ఎంపవర్! నెలకు 2 రోజులు.. డ్రగ్స్ నిర్మూలనకు నడుం బిగిద్దాం..
యాంటి నార్కొటిక్స్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనుకునే వారు 9000207783 నంబర్‌ను, లేదా pm@hcsc.in ను సంప్రదించొచ్చు. ఈ కార్యక్రమం కోసం నెలకు రెండు రోజులు కేటాయిస్తే చాలు. డ్రగ్ ఫ్రీ సిటీగా మన నగరాన్ని తయారు చేసుకోవచ్చని యాంటి నార్కొటిక్స్ అధికారులు చెబుతున్నారు. యాంటి నార్కొటిక్స్ వాలంటీర్‌గా మారమని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆహ్వానిస్తోంది.

Anti-Narcotics Bureau | డ్రగ్స్ ముఠాల కట్టడిపై తెలంగాణ యాంటి నార్కొటిక్స్ బ్యూరో మరింత దృష్టి సారించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగించే వారు, సరఫరా చేసే స్మగ్లర్లపై కన్నేసి, ఎక్కడికక్కడ డ్రగ్స్ రవాణాను కట్టడి చేస్తున్నారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా ఉండేందుకు నార్కొటిక్స్ బ్యూరో అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నది. డ్రగ్స్ వల్ల తలెత్తే అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది.డ్రగ్స్ నిర్మూలనలో యువతను కూడా భాగస్వామ్యం చేస్తున్నది. డ్రగ్స్ వాడకం వల్ల తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని, ఇది సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని యువతకు విడమరిచి చెబుతున్నారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, చెడు వ్యసనాలకు బానిసలుగా మారొద్దని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని యువత, విద్యార్థుల చేత ప్రమాణం చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ భాగ్యనగరాన్ని డ్రగ్ ఫ్రీ కమ్యూనిటీగా తీర్చిదిద్దేందుకు యువత యాంటి నార్కొటిక్స్ వాలంటీర్‌గా పని చేయాలని కోరుతున్నది. ప్రొటెక్ట్, ఎడ్యుకేట్, ఎంపవర్ అనే నినాదంతో డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు నడుం బిగించింది. యాంటి నార్కొటిక్స్ పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు కదిలి రావాలని యువతకు పిలుపునిస్తోంది.
వాలంటీర్‌గా ఏం చేయొచ్చు..?
యాంటి నార్కొటిక్స్ వాలంటీర్‌గా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహించాలి.
డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలి.
డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారికి మద్దతుగా నిలిచి, వారిలో మార్పు తేవాలి.
డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలకు నాయకత్వం వహించాలి.
యాంటి నార్కొటిక్స్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనుకునే వారు 9000207783 నంబర్‌ను, లేదా pm@hcsc.in ను సంప్రదించొచ్చు. ఈ కార్యక్రమం కోసం నెలకు రెండు రోజులు కేటాయిస్తే చాలు. డ్రగ్ ఫ్రీ సిటీగా మన నగరాన్ని తయారు చేసుకోవచ్చని యాంటి నార్కొటిక్స్ అధికారులు చెబుతున్నారు. యాంటి నార్కొటిక్స్ వాలంటీర్‌గా మారమని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆహ్వానిస్తోంది.
డ్రగ్ కంట్రోల్‌లో హెచ్ఎన్ఈడబ్ల్యూ మొదటి స్థానం..
ఇటీవల రాష్ట్ర పోలీసులకు ప్రపంచంలోనే అరుదైన గౌరవం లభించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ నివారణకు చేస్తున్న కృషికి గాను హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. హెచ్ఎన్ఈడబ్ల్యూ చీఫ్ సీవీ ఆనంద్ ఎక్సలెన్స్ ఇన్ యాంటి – నార్కొటిక్స్ అవార్డును దుబాయ్‌లో నిర్వహించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ -2025 లో అందుకున్నారు. ఈ సదస్సులో 138 దేశాల నుంచి ఆయా పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో నిర్వహించిన పోటీలో హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకున్నది. హైదరాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడానికి తీసుకున్న పటిష్టమైన చర్యలు, విద్యార్థులు, సాధారణ ప్రజల్లో అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలను వరల్డ్ పోలీస్ సమ్మిట్ పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో హెచ్ఎన్ఈడబ్ల్యూ వింగ్ గత మూడేండ్లలో సాధించిన ఫలితాలను పరిశీలించి.. అవార్డుకు ఎంపిక చేసింది.