Nambala Keshavarao | రాడికల్ స్టూడెంట్ నుంచి.. విప్లవోద్యమ సారథ్యం వరకూ.. నంబాల కేశవరావు ప్రస్థానం
అలిపిరిలో చంద్రబాబుపై దాడి, విశాఖ జిల్లాలో కిడారి సర్వేశ్వరరావు హత్య, సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై జీరంఘాట్లో దాడి హత్య, 27 మంది కాంగ్రెస్ నేతల హత్య, తాడిమెట్లలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల హత్య, సీలేరు నదిలో లాంచీపై దాడి చేసి గ్రేహౌండ్స్ బలగాలను హతమార్చిన ఘటనలో ఈయన హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇతనిపై రూ.1.50కోట్ల రివార్డు ఉంది.

- శ్రీకాకుళం నుంచి వచ్చి.. ఓరుగల్లులో ఎదిగి..
- ఆవిర్భావం నుంచి అత్యున్నత స్థానం వరకూ
- ఓరుగల్లు నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు సుదీర్ఘ ప్రస్థానం
- గెరిల్లా యుద్ధతంత్రంలో నిపుణుడిగా గుర్తింపు
- ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
- ఇదీ నంబాల కేశవరావు ఉద్యమ నేపథ్యం
- ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్‌కౌంటర్ ఇదే మొదటిది
విధాత ప్రత్యేక ప్రతినిధి:
Nambala Keshavarao | మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ జనరల్ సెక్రటరీ, ‘మోస్ట్ వాంటెడ్’ నక్సలైట్‌గా పేరొందిన నంబాల కేశవరావు (Nambala Keshavarao) అలియాస్ బసవరాజ్, అలియాస్ గంగన్న అలియాస్ ప్రకాశ్.. బుధవారం నాటి ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఆ పార్టీలో అత్యున్నత స్థాయి నాయకునిగా కేశవరావు గుర్తింపు పొందారు. భారత విప్లవోద్యమ చరిత్రలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్‌కౌంటర్ కావడం ఇదే ప్రథమంగా చెబుతున్నారు.
2018లో పార్టీ ప్రధాన బాధ్యత
2018లో పార్టీ జాతీయ కార్యదర్శి బాధ్యతలకు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేశాక.. నవంబర్ 10న ప్రధానకార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్నికయ్యారు. 1970 నుంచి ఈయన ప్రస్థానం షురూ అయ్యింది. 1980లో సీపీఐ ఎంఎల్ (పీపుల్స్ వార్) (CPI ML (People’s war)) ఆవిర్భావంలో ఈయనది కీలక పాత్ర. మార్క్సిజం, లెనినిజం, మావోయిజంకు కట్టుబడి పనిచేస్తూ అంచలంచెలుగా పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్షేత్రస్థాయిలోనే ఉంటూ కేడర్‌కు విశ్వాసాన్ని కలిగించే నేతగా బసవరాజుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటికీ పార్టీ కేడర్‌ను అంటిపెట్టుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడానికి ముందు మిలిటరీ కమిషన్ చీఫ్‌గా ఆయన వ్యవహరించారు. గెరిల్లా యుద్ద తంత్రంలో, పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకపోవడంలో కేశవరావు పెట్టింది పేరని చెబుతుంటారు. నంబాల కేశవరావు శ్రీకాకుళం జిల్లా కొటబొమ్మాళి మండలం జియ్యన్నపేటకు గ్రామానికి చెందినవారు. 1955లో జన్మించారు. ఆయనకు తల్లి, సోదరుడు ఉన్నారు. కేశవరావుకు ఆ గ్రామంలో ఈతరం వాళ్లకు పరిచయం లేనప్పటికీ, పాతతరం వాళ్లు ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకుంటారు. స్థానిక యువత ఆయన పేరు విన్నామంటున్నారు. మంచి వ్యక్తిగానే పేరుండేదని చెబుతున్నారు. ఆయన తండ్రి స్కూల్ టీచర్ గా చేసేవారు. కేశవరావు ప్రాథమిక విద్య సొంతగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగాంలో హౌస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన రెండో సంవత్సరం డిగ్రి చదువుతుండగా వరంగల్ ఆర్‌ఈసీలో (Warangal REC) బీటెక్ సీటు రావడంతో అక్కడ జాయిన్ అయ్యారు. ఎంటెక్ పూర్తి చేశారు. అక్కడనుంచి కథ మారిపోయిందని చెబుతున్నారు.
రాడికల్ స్టూడెంట్ నుండి
కేశవరావు ఆర్ఈసీలో ఎంటెక్ చదువుకునే క్రమంలోనే కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి తదితరులతో ఏర్పడిన పరిచయం క్రమంగా రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసే స్థాయికి చేరింది. తదుపరి అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరి విప్లవోద్యమమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగారు. ఈ క్రమంలో కుటుంబం కోసం తిరిగి వస్తాడని కుటుంబసభ్యులు ఎదురు చూసిన రోజులున్నాయి. 1983లో అరెస్టు అయి విశాఖ జైల్లో ఉన్న సమయంలో కుటుంబసభ్యులు ఉద్యమాలు వద్దు.. గ్రామంలోకి వస్తే వ్యవసాయం చేసుకుందామని ఎంతమందితో మాట్లాడించినా.. సరే అంటూనే ఆయన అడుగులు అడవివైపు పడ్డాయని చెబుతున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి బాధ్యతలు
ఆర్ఈసీలో చదివే రోజుల్లో ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ)లో పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ విద్యార్ధి సంఘాలతో జరిగిన ఘర్షణల్లో తొలిసారి అరెస్ట్ అయ్యారు. కబడ్డీ ఆటగాడిగా కూడా ఆయనకు పేరుంది. గెరిల్లా యుద్ద తంత్రంలో నేర్పరి. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో పనిచేసిన తొలి కమాండర్. మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలిసి దాడులకు వ్యూహరచన చేసేవారని ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. ఎల్టీటీఈ సహకారంతో యుద్ధతంత్రాల్లో శిక్షణ పొందినట్లు చెబుతారు. మావోయిస్టు పార్టీలో మిలిటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసి, దానికి చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో, అబూజ్‌మడ్‌ను రాజధానిగా చేసుకుని విప్లవకారిడార్‌ను నేపాల్ వరకు విస్తరించిన నాయకత్వంలో కీలకపాత్ర పోషించారు. శత్రువులపై దూకుడుగా పోరాటం చేయడంలో బలగాలకు ట్రైనింగ్ ఇచ్చారు.
పలు కీలక సంఘటనల్లో పాత్ర
2004లో పీపుల్స్ వార్ నుంచి మావోయిస్టు పార్టీగా మార్చే క్రమంలో తోటి నాయకత్వంతో కలిసి కీలక పాత్ర పోషించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో జరిగిన పలు దాడుల్లో ఈయన పాత్ర ఉంది. అలిపిరిలో చంద్రబాబుపై దాడి, విశాఖ జిల్లాలో కిడారి సర్వేశ్వరరావు హత్య, సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై జీరంఘాట్లో దాడి హత్య, 27 మంది కాంగ్రెస్ నేతల హత్య, తాడిమెట్లలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల హత్య, సీలేరు నదిలో లాంచీపై దాడి చేసి గ్రేహౌండ్స్ బలగాలను హతమార్చిన ఘటనలో ఈయన హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇతనిపై రూ.1.50కోట్ల రివార్డు ఉంది.
గ్రామంలో విషాదఛాయలు
చదువులో కేశవరావు ఘనాపాటి అని, మంచికి మారు పేరని గ్రామస్తులు, ఆయను ఎరిగినవారు, విన్నవారు ఒక్కోరకంగా చెబుతున్నారు. తామెన్ని విధాలుగా నచ్చజెప్పినా ఉద్యమాల్లోకే వెళ్లాడని అంటున్నారు. ఉద్యమంలో చేరిన తరువాత గ్రామానికి ఎప్పడు రాలేదని తల్లి, సోదరుడు చెబుతున్నారు. ఆయన కోసం పోలీసులు వచ్చిన సందర్భాలున్నాయే గాని మా వాళ్లు , మా బంధువులంటూ కేశవరావు ఒక్క రోజు కూడా గ్రామానికి రాలేదని చెబుతున్నారు. ఉద్యమబాటపట్టిన ఆయన రోజు రోజుకు ఆ పార్టీలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగారే తప్ప గ్రామంలో, బంధువులు ఇంట ఒక్క రోజు అడుగు పెట్టలేదని చెబుతున్నారు. కేశవరావు మృతితో ఆయన సొంత గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.