sajjala: సజ్జలకు సమన్లు

– కొమ్మినేని అరెస్ట్ అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలు
– ఫిర్యాదు అందడంతో మహిళా కమిషన్ చర్యలు
sajjala: విధాత, అమరావతి: సాక్షి మీడియాలో అమరావతి మహిళల గురించి చేసిన వివాదాస్పద కామెంట్లతో ఏపీలో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశం రోజురోజుకు తీవ్రమవుతున్నది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సజ్జలకు కూడా మహిళా కమిషన్ సమన్లు జారీ చేయనున్నది.
కొమ్మినేని అరెస్ట్ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సైతం నోటీసులు ఇస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. ఆయన వ్యక్తిగతంగా హాజరై కమిషన్ ముందు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని మహిళలు మంగళగిరిలోని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అమరావతి ప్రాంత మహిళలంటే చులకనైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు కేసులతో వేధించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
వైసీపీ ఓటమికి రాజధాని మహిళలే కారణమని భావించి తమ మీద కక్ష పెంచుకున్నారని వారు వాపోయారు.