ఎన్నికల సంఘంపై.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!

విధాత : అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత ఎన్నికల వ్యవస్థపై ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ బోస్టన్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల వ్యవస్థలో లోపాలున్నాయని నేను పదే పదే చెబుతున్నానని..కేంద్ర ఎన్నికల సంఘం రాజీ పడిందని ఆరోపించారు. ఇందుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియనే ఉదాహారణ అని రాహుల్ గాంధీ వివరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్నారు. పోలింగ్ రోజు సాయంత్రం 5.30 నుంచి 7.30 మధ్య 65 లక్షల మంది ఓటేశారన్నారు.
ఒక్కొక్కరు ఓటు వేసేందుకు కనీసం 3 నిమిషాల సమయం పడుతుందన్నారు. మరి అంత తక్కువ సమయంలో అంత మంది ఎలా ఓటు వేస్తారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మేము పోలింగ్ వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించిందన్నారు. ఇప్పుడు అలా అడగటానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’ అని రాహుల్ ఆరోపించారు. అందుకే తాను ఎన్నికల వ్యవస్థలో లోపాలున్నాయని చెబుతున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా- భారత్ సంబంధాలను గురించి కూడా మాట్లాడారు. ఇరుదేశాలు కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
#rahulgandhi 65 Lakh Votes in 2 Hours, EC Denies Footage #congress #bjp #ec pic.twitter.com/Y1u6fMoT83
— srk (@srk9484) April 21, 2025
రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
భారత ఎన్నికల సంఘంపైన..ఎన్నికల వ్యవస్థపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ మరోసారి ‘భారత్ బద్నాం యాత్ర’, ‘ఇండియా అబ్యూస్ యాత్ర’ చేస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై దాడి చేస్తూ, విదేశాల్లో భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత ఎన్నికల వ్యవస్థను, ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రశంసించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేశవన్ ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలు ఆయన అవగాహనారాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు.
బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్యానికి, భారతదేశానికి వ్యతిరేకి అయిన రాహుల్ గాంధీ దేశీయ ఓటర్ల నమ్మకాన్ని గెలవలేకపోయారన్నారు. ఇప్పుడు విదేశీ గడ్డపై మన దేశ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నించడం ప్రారంభించారు’ అని భండారీ విమర్శించారు. ఈసందర్భంగా విదేశాల్లో భారత పరువును పదే పదే ఎందుకు తీస్తారని రాహుల్‌ను ప్రశ్నించారు. పార్టీ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనావాలా సైతం రాహుల్‌పై విరుచుకుపడ్డారు. అమెరికాలో భారతీయ సంస్థలను, న్యాయస్థానాలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు.
#rahulgandhi 65 Lakh Votes in 2 Hours, EC Denies Footage #congress #bjp #ec pic.twitter.com/Y1u6fMoT83
— srk (@srk9484) April 21, 2025