సామాజిక న్యాయమే ప్రజాపాలన లక్ష్యం కుటుంబ న్యాయమే కేసీఆర్ పాలన తీరు

సామాజిక న్యాయమే ప్రజాపాలన లక్ష్యం కుటుంబ న్యాయమే కేసీఆర్ పాలన తీరు

సామాజిక న్యాయమే ప్రజాపాలన లక్ష్యం
కుటుంబ న్యాయమే కేసీఆర్ పాలన తీరు
వరంగల్‌ గడ్డ ప్రజా చైతన్యానికి ప్రతీక
ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం
ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందిస్తోంది
––––– పరకాల సభలో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

కుటుంబ ఉన్నతే లక్ష్యంగా పనిచేసిన కేసీఆర్ పాలనకూ, సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజాపాలనలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తారకరామారావు, హరీష్ రావులు మంత్రులయ్యారు. నేను సీఎం అయితే మా సీతక్క, సురేఖమ్మలు మంత్రులయ్యారు. ఆయన ఎర్రబెల్లిని మంత్రిని చేస్తే నేను అడ్లూరిని మంత్రిని చేశాను. ఆయన తన బిడ్డను ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసుకుంటే నేను మా చెల్లె కావ్యను ఎంపీగా చేసిన, యశస్విని ఎమ్మెల్యేగా చేశాను. కేసీఆర్ సంతోష్ రావును రాజ్యసభకు పంపిస్తే నేను మిత్ర ధర్మంగా వేం నరేందర్ రెడ్డిని పంపించాను. ఆయన వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చేసిండు, నేను జేఏసీ చైర్మన్ కొదండరామ్ను ఎమ్మెల్సీ చేశాను. మీరు పోల్చుకోండి. కేసీఆర్ ది కుటుంబ న్యాయమైతే… నాది సామాజిక న్యాయమంటూ వివరించారు. కేసీఆర్ తన కొడుకును వర్కింగ్ ప్రసిడెంట్ చేస్తే నేను మహేష్ గౌడ్ను పీసీసీ చేశాను. కేసీఆర్ సీఎం అయితే ఆయన కుటుంబానికి లాభం, అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజల కోసం పనిచేసే చిత్తశుద్ధి, వయస్సు, అంకితభావం ఉందన్నారు. పాలమూరు పల్లె నుంచి వచ్చిన వాన్నంటూ కితాబిచ్చుకున్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నన్నినాళ్ళు వెయ్యి మంది కేసీఆర్లు వచ్చినా తనను ఏం పీకలేరంటూ సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి బాట విజయోత్సవ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు ముఖ్యమంత్రి దాదాపు రూ.484 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దీనికి ముందు మేడారాన్ని సందర్శించి సమ్మక్క,సారలమ్మలకు మొక్కులు సమర్పించారు. ములుగు జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని, హ్యామ్ రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగాసీఎం ప్రసంగించారు.

కార్యకర్తల రక్తం అమ్ముకున్నారు:

మొన్న రక్తదానం నిర్వహించారు…ఇక్కడ కూడా కేటీఆర్, హరీష్ రావులు కాకుండా పిల్లల రక్తం దానం చేశారంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దండుకున్నారు. పదవులన్నీ మీరే అనుభవిస్తిరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే కూడా మీ కార్యకర్తలు, పిల్లల రక్తాన్ని అమ్ముకుంటున్నారంటూ విమర్శించారు. మీరు మనుషులా? రాక్షసులా? అంటూ మండిపడ్డారు.

కన్నబిడ్డ కవితకు అన్యాయం:

రక్త సంబంధం లేకున్నా…మా ఇంటి ఆడబిడ్డగా సీతక్కకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. అదే రక్తం పంచుకున్న కల్వకుంట్ల కవితకు కష్టాల్లో ఉన్నరని తెలిసినా ఇంట్లో నుంచి గెంటేసిన చరిత్ర కేటీఆర్ ది కాదా? కన్న తండ్రి కండ్లు మూసుకుంటరా? కొడుకును పిలిచి సలాకతో కాల్చి వాతపెట్టాల్సింది కాదా? అంటూ సీఎం రేవంత్ నిలదీశారు.

సెప్టెంబర్ లో అసెంబ్లీ… చర్చకు సిద్ధం :

పదే పదే బావాబామ్మరుదులు మా ప్రభుత్వంలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరిగిందో చర్చిద్దామంటున్నారు…వారి కోరిక మేరకు సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం…బావాబామ్మర్ధులతో పాటు కేసీఆర్ ను కూడా తీసుకరావాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ కేంద్రమంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పే కేసీఆర్ శాసనసభకు రావాలన్నారు. పది సంవత్సరాలు వారి పాలనలో తీసుకున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధితో పాటు మన ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అభివృద్ధిపై చర్చించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వారసత్వంగా అందించిన 8లక్షల11వేల కోట్ల రూపాయల అప్పుకు అసలూ, మిత్తిగా ప్రతి ఏటా 75వేల కోట్లు చెల్లిస్తున్నాం. తెలంగాణ రాక ముందు 6వేల 500 కోట్ల అప్పులుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన అప్పులకూ తప్పులకు 75వేల కోట్లు సంవత్సరానికి చెల్లిస్తున్నాం. అప్పులకు పాయమాల్ కడుతున్నాం,,ఇచ్చిన మాట కోసం మట్టిలో కలిసినా పర్వాలేదూ…మడమ తిప్పేది లేదని ప్రకటించారు. 8లక్షల కోట్ల అప్పు… లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంకూలిపోయి కూలేశ్వరం అయినప్పటికీ కృష్ణా, గోదావరి నదుల నీళ్ళను తరలించి దేశంలో అగ్రస్థానంలో నిలిచే విధంగా వరి పండించామన్నారు. రూ.90వేల కోట్లు వరి కొనుగోలుకు చెల్లించాం, రైతులకు లక్ష రుణమాఫీ అని చెప్పిన కేసీఆర్ అమలు చేయకపోయానా…మేము ఇచ్చిన హామీ మేరకు 20లక్షల కోట్లు ఇచ్చి రూ. 2లక్షల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం ఒక లక్షా 70వేల కోట్లు ఖర్చుచేశామన్నారు.

ఆధిపత్యవాదులను బొందపెట్టిన వరంగల్ :

వరంగల్‌ గడ్డకు గొప్ప చరిత్ర, పోరాట స్ఫూర్తి, ప్రజా చైతన్యం ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. మేము ప్రజలకు అతీతులం, దేవుల్లమని భావిస్తురో…ప్రజల పై ఆధిపత్యం చెలాయించాలనుకుంటరో…ప్రజలను అణచివేయాలని ఆలోచిస్తరో అప్పుడు ఈ వరంగల్ గడ్డ మీద నుంచి వచ్చిన చైతన్యం వారిని గోతితీసి బొందపెట్టిన చరిత్ర ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగినవారు, భార్యా,భర్తల సంభాషణలు విన్నవారు, ఇక ఎప్పటికీ అధికారం మాదేనని భావించిన వారిని, మమ్మల్ని ఓడించేవారేలేరని విర్రవీగిన వారిని యశస్విని లాంటి చిన్నమ్మాయి 50వేల ఓట్లతో బండకేసి కొట్టిందన్నారు.రాజకీయాల్లో కొండా….కాకలుతీరిన బండా అని భావించిన వ్యక్తిని బండకేసి కొడితే పక్కునపగిలి వెయ్యిముక్కలైందంటూ ఎర్రబెల్లి దయాకర్ రావును ఎద్దేవా చేశారు. ఇది నాదో ఎవరిదో ఒక్కరి గొప్పదనం కాదు, ప్రజల గొప్పదనమంటూ అభివర్ణించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే, పోరాడే చైతన్యం వరంగల్‌ ప్రజల సొంతమని అన్నారు.

నిరుపేదల సంక్షేమమే ధ్యేయం:
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం అన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, ఉచిత విద్యుత్‌, ఇతర సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తున్నామని తెలిపారు.పేదల జీవితాల్లో ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ప్రజాప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు:
నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం అన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేశామని, మిగిలిన ఖాళీలను కూడా దశలవారీగా భర్తీ చేస్తామని తెలిపారు. యువత ఎలాంటి అపోహలకు లోనుకాకుండా పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధం కావాలని సూచించారు. యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు.

*వరంగల్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం*

వరంగల్‌ నగర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం తెలిపారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ సభలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క , పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం, నాయిని, దొంతి, నాగరాజు, యశస్వనిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, రాంచందర్ నాయక్, మురళీనాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు జిల్లా కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
!!!!

Latest News