New Seed Law | నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దు: మంత్రులు తుమ్మల, సీతక్క

New Seed Law | విధాత, ములుగు : నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దని, విత్తన చట్టాన్ని రూపొందించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల రైతులకు పరిహారం అందజేశారు. 1521 ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన 671 రైతులకు రూ. 3 కోట్ల 80 లక్షల 97 వేల 264 చెక్కులను మంత్రులు తుమ్మల, సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం జిల్లా అధికారుల సమిష్టి కృషితో సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో రైతులకు రూ. లక్ష అయిదు కోట్ల పథకాలు అందించి ఆదుకున్నామని అన్నారు.
రైతులు మోసపోకుండా నూతన విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. రాష్టంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ఫలాలను అమలు చేస్తున్నదన్నారు. కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గత పాలకులు రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని, తాము అధికారంలోకి వచ్చిన అనంతరం ఇందిరమ్మ రాజ్యం ద్వారా రైతులకు అన్ని సంక్షేమ ఫలాలను అందజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రైవేట్ విత్తన కంపెనీలను ఒప్పించడంలో జిల్లా అధికారులు విజయం సాధించారని అన్నారు.
2019 సంవత్సరంలో రైతులు 2 వేల ఎకరాల మిర్చి పంట కోల్పోగా గత పాలకులు ఏ మాత్రం పట్టించుకోకుండా తాము చేస్తున్న పనులను జీర్ణించుకోని కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, భరోసా, సన్నాలకు బోనస్ లాంటివి తెచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటీడిఏ పి.ఓ.చిత్ర మిశ్రా,ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.